ప్లాట్‌ఫామ్ పైనే రైల్వే పోలీసులు

25 May, 2016 03:08 IST|Sakshi
ప్లాట్‌ఫామ్ పైనే రైల్వే పోలీసులు

* వసతుల్లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది
* పట్టించుకోని రైల్వే అధికారులు
నగరంపాలెం (గుంటూరు) : గుంటూరు రైల్వేస్టేషనులో  రైల్వే పోలీసులకు సరైన వసతులు లేక ప్లాట్‌ఫామ్‌ల పైనే విధులు నిర్వహిస్తున్నారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై, రైళ్లలో నేరాల నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం రైల్వే పోలీసులను రైల్వేశాఖకు కేటాయిస్తుంది. వీరికి అవసరమైన పోలీస్ స్టేషన్‌ను రైల్వేశాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గుంటూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌కు సుమారు 30 సంవత్సరాల క్రితం నాలుగు-ఐదు ప్లాట్‌ఫ్లామ్‌ల మధ్యలో, గతంలో బుకింగ్ కౌంటరుగా వినియోగించిన రెండు గదులను కేటాయించారు.

ఎస్‌ఐ స్థాయి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రస్తుతం డివిజన్ ముఖ్య పోలీస్‌స్టేషన్‌గా మారి సిబ్బంది పెరిగినా ప్రస్తుతం అదేప్రాంతంలో సిబ్బంది సర్దుకుంటున్నారు. ఇందులో గుంటూరు, తెనాలికి చెందిన సీఐ కార్యాలయాలు ఒక గదిలో, గుంటూరు స్టేషనుకు సంబంధించిన ముగ్గురు ఎస్‌ఐలు, ఐదుగురు హెచ్‌సీలు, 43మంది కానిస్టేబుళ్ల ఆఫీస్‌రూం, లాకప్‌లు ఒక గదిలో కొనసాగుతున్నాయి. కార్యాలయంలో కనీసం కుర్చోవడానికి కూడా చోటులేకపోవటంతో సిబ్బంది ప్లాట్‌ఫామ్ పైనే చిన్న పార్టిషన్ కట్టుకుని కూర్చుంటున్నారు.

ఇక హెల్ప్‌డెస్క్ ప్లాట్‌ఫామ్ పైనే ఏర్పాటుచేశారు. రికార్డు రూం, ఆర్మ్‌డ్ గది అసలు లేదు. స్టేషన్‌లో  24 గంటలు విధులు నిర్వహించాల్సి రావడంతో కాసేపు సేదతీరే అవకాశమే లేదని సిబ్బంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌కు కేటాయించిన భవనం గుంటూరు రైల్వే స్టేషను ఏర్పడినప్పుడు నిర్మించినది కావడంతో పది సంత్సరాల క్రితమే పెంకులతో నిర్మించిన కప్పు శిథిలావస్థకు చేరి మట్టి రాలుతోందన్నారు. దీని కోసం సీలింగ్ చేసినా వర్షాకాలంలో పై కప్పు నుంచి నీరు కారి సీలింగ్ పూర్తిగా చెడిపోవడంతో తొలగించివేశారు.

స్టేషన్‌లో రైల్వే శాఖకు చెందిన కార్యాలయాలపై ఉన్న శ్రద్ధలో కనీసం పది శాతం కూడా రైల్వేపోలీస్‌స్టేషన్‌పై చూపడం లేదని సిబ్బంది వాపోతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు స్టేషన్‌కు రంగులు వేయడం తప్ప పూర్తిస్థాయి మరమ్మతులు చేసిందిలేదన్నారు. ప్రస్తుత స్థలంలోనైనా రెండు అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందన్నారు. పోలీస్‌స్టేషను మరమ్మతుల కోసం రైల్వే పోలీసులు డివిజన్ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు పంపినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తున్న రైల్వే పోలీసుల సమస్యల పరిష్కారం కోసం డివిజస్థాయిలోని రైల్వే ఉన్నతాధికారులు కృషిచేయాల్సిన అవసరం ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు