ఎక్కువ మాట్లాడకు.. లోపలేసి బొక్కలూడదీస్తా!

26 Feb, 2019 03:14 IST|Sakshi
ఉండవల్లి కొండవీటి వాగు వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు

యూ–1 జోన్‌ను తొలగించాలన్న రైతులపై డీఎస్పీ తిట్ల దండకం

ప్రకాశం బ్యారేజీ వద్ద బైఠాయింపు.. ఈడ్చేసిన పోలీసులు

వారి తీరుపై రైతు సంఘాల తీవ్ర ఆగ్రహం

జోన్‌ను ఎత్తేయకపోతే సీఎం ఇంటి ముందు ఆత్మహత్యేనని హెచ్చరిక

సీఎం వద్దకు పంపేందుకు ముందు నిరాకరణ.. ఆ తర్వాత ఓకే

మూడున్నర గంటలపాటు కూర్చోబెట్టాక ముఖ్యమంత్రి వద్దకు..

హా.. చూస్తా అంటూ నిమిషంలో చెప్పి పంపేసిన సీఎం

సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్‌: ఎక్కువ మాట్లాడకు.. తాటతీస్తా.. లోపలేసి బొక్కలూడదీస్తా.. రిమాండ్‌కు తరలించి మీ అంతు చూస్తా.. ఇదీ రాజధానిలో రైతులపై పోలీసుల తిట్లదండకం. తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి, వడ్డేశ్వరంలోని తమ 170 ఎకరాల భూములను యూ–1 రిజర్వ్‌ జోన్‌ నుంచి తొలగించి న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లిన రైతులపై గుంటూరు నార్త్‌జోన్‌ డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి సీఐ శ్రీనివాసరావు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ హెచ్చరించారు. దీంతో రైతులు, అఖిలపక్షం నేతలు రోడ్డుపైనే బైఠాయించడంతో సోమవారం ప్రకాశం బ్యారేజి, ఉండవల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బహుళ పంటలు పండే, కోట్ల విలువ చేసే తమ పంట పొలాలను కాపాడుకునేందుకు రాజధానిలోని 4 గ్రామాలకు చెందిన 200మంది రైతులు సోమవారం ఉదయం తాడేపల్లి పట్టణంలోని వైఎస్సార్‌ సెంటర్‌ నుంచి పాదయాత్ర చేపట్టారు. తమ భూములను యు–1 జోన్‌గా ప్రకటించడం దారుణమని, వెంటనే దాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న తాడేపల్లి సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి ఎన్నికల కోడ్‌ ఉంది, ర్యాలీ చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. దీంతో రైతులు.. అరెస్టుచేస్తే చేయండి అంటూ ముందుకు సాగారు.

ఉండవల్లి సెంటర్‌లో పోలీసులు మరోసారి అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా, రైతులు ముందుకెళ్లారు. అక్కడి నుంచి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నుంచి కరకట్ట మీదుగా సీఎం ఇంటి వైపునకు బయల్దేరారు. కానీ, ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతించక రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగి బైఠాయించారు. దీంతో ప్రకాశం బ్యారేజీ–మంగళగిరి రహదారిపై ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది.  రైతులంతా అడ్డం తిరగడంతో వెనక్కితగ్గిన పోలీసులు ఆరుగురిని వాహనంలో సచివాలయానికి తీసుకెళ్లారు. పలువురు రైతులు, అఖిల పక్ష నేతలు మాట్లాడుతూ.. గత సోమవారం కూడా పోలీసులు, ప్రభుత్వం ఇలాగే మభ్యపెట్టి తమను వెనక్కి పంపించారని, ఈసారీ అదే జరుగుతోందన్నారు. యు–1 జోన్‌ ఎత్తివేయకపోతే సీఎం ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. రైతు సంఘం నేతలు  జొన్నా శివశంకరరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ నేతలు కంచర్ల కాశయ్య, వెంకటయ్య, వైఎస్సార్‌సీపీ పట్టణ గౌరవాధ్యక్షుడు కేళీ వెంకటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి యం.డి.గోరె, సీపీఎం పట్టణ అధ్యక్షులు బూరగ వెంకటేశ్వర్లు, వివిధ రైతు సంఘాల నాయకులు, తాడేపల్లి, కొలనుకొండ, వడ్డేశ్వరం, కుంచనపల్లికి చెందిన రైతులు పాల్గొన్నారు.

5 నిమిషాలు కూడా సమయమివ్వని సీఎం
ఇదిలా ఉంటే.. సచివాలయానికి చేరుకున్న రైతులను మ.2 గంటల నుంచి మూడున్నర గంటల పాటు కూర్చోబెట్టారు. సా.5.30 గంటల సమయంలో సీఎంతో మాట్లాడేందుకు అధికారులు అనుమతిచ్చారు. తాడేపల్లి అనగానే ‘హా... నేను చూస్తా’ నని చంద్రబాబు చెప్పి.. తమను అక్కడి నుంచి వెంటనే పంపించేశారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో కుప్పం నుంచి వచ్చిన సుమారు 30 మందితో సెల్ఫీలు తీసుకున్న సీఎంకు తమతో 5 నిమిషాలు మాట్లాడ్డానికి కూడా సమయం ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒకే సర్వే నంబర్‌లో నిరాకరణ, అనుమతులు
రైతుల భూములను యు–1 జోన్‌లోను, టీడీపీ ఎంపీ భూములను కమర్షియల్‌ జోన్‌లో ఉంచడం దారుణం. ఓ పక్క మురళీమోహన్‌ 9 అంతస్తుల మేడలు కడుతూ జేబులు నింపుకుంటుంటే, అన్నదాతలు మాత్రం తమ భూములను కోల్పోవాల్సిన పరిస్థితి. జోన్‌ ఎత్తివేయకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తాం. 
– జొన్నా శివశంకరరావు, రైతు సంఘం నేత

ఉన్న 25 సెంట్ల భూమిని తీసుకుంటే ఏం చేయాలి?
యు–1 జోన్‌లో ప్రకటించిన 170 ఎకరాల్లో దాదాపుగా 350 మంది చిన్న రైతులున్నారు. అలాంటి భూములను ప్రభుత్వం లాక్కుంటే మేం ఏం చేయాలో పోలీసులు చెప్పాలి. తెలుగుదేశం వారు ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంటే కాపలా కాస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేస్తారా? ఇదెక్కడి న్యాయం?   
 – వెంకట్రామిరెడ్డి, రైతు

మా బిడ్డలకు ఏం ఇవ్వాలి?
ఉన్న పాతిక సెంట్లు ధారాదత్తం చేసి, మా బిడ్డలకు ఏం ఇవ్వాలి? ఇక్కడ సెంటు ప్రస్తుతం రూ.25 లక్షలు ఉంది. ఇలాంటివి ప్రభుత్వం తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు.
– సత్యనారాయణరెడ్డి, రైతు

మరిన్ని వార్తలు