హైవేపై నిఘా కరువు

14 Feb, 2019 13:48 IST|Sakshi
నాయుడుపేటలోని జాతీయ రహదారి

కాసుల వేటకే పెట్రోలింగ్‌ వాహనాల పరిమితం

యథేచ్ఛగా దోపిడీలు

జాతీయ రహదారిలో పోలీసు నిఘా కరువైంది. దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో హైవేపై రాకపోకలు సాగించాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు హడలెత్తుతున్నారు. కావలి నియోజకవర్గంలో హైవేపై మంగళవారం అర్ధరాత్రి రూ.4.50 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్ల దోపిడీ జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. హైవేపై నిఘా డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టింది.  

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో కావలి నుంచి తడ వరకు 175 కి.మీ మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. 15 పోలీసు స్టేషన్లున్నాయి. రహదారిపై పోలీసు నిఘా కొరవడడంతో దోపిడీలు, దొంగతనాలు పెరుగుతున్నాయి. స్థానిక దొంగలతో పాటు అంతర్రాష్ట్ర నేరగాళ్లు రహదారి వెంబడి మాటేసి అందిన కాడికి దోచుకెళుతున్నారు. ఒక్కో సమయంలో హత్యలకు వెనుకాడడం లేదు. ప్రధానంగా విలువైన వస్తువులు (బంగారు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, అల్యూమినియం, కాపర్‌ వైర్లు తదితరాలు) తరలించే వాహనాలను మార్గమధ్యలో అటకాయించి అందులోని వారిపై దాడి చేసి వాహనాలతో సహా దోచుకెళుతున్నారు. గతంలో ఒకటి, అరా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండగా ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. దీంతో విలువైన వస్తువులతో రహదారిలో ప్రయాణించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ద్విచక్ర వాహనచోదుకులపైనా దాడులు అధికమయ్యాయి.

కొన్ని ఘటనలు
గతంలో తమిళనాడు తూత్తుకుడి నుంచి కాపర్‌లోడ్‌తో గుజరాత్‌కు బయలుదేరిన లారీని మార్గమధ్యలో అటకాయించిన దుండుగులు డ్రైవర్‌ను హతమార్చి లారీని హైజాక్‌ చేశారు. తడ సమీపంలో ఓ లారీలో నుంచి గృహోపకరణాలు దొంగలించారు. వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో ఓ బాంగారు వ్యాపారి కారును అటకాయించి అతనిపై దాడిచేసి రూ.3 కోట్లు విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. కోవూరు సమీపంలో రూ.10 లక్షలు విలువచేసే లారీ టైర్లను దోచుకున్నారు.

ఆ దిశగా పనిచేయడంలేదు
జాతీయ రహదారి వెంబడి నేరాలు, ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా హైవే పెట్రోలింగ్‌ వ్యవస్థ ఏర్పాటైంది. కావలి నుంచి తడ వరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 10 పెట్రోలింగ్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటికి జీపీఎస్‌ సిస్టంను అమర్చి కమాండ్‌ కంట్రోల్‌ సిస్టంకు అనుసంధానం చేశారు. ఒక్కో వాహనంలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు లేదా ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. సదరు వాహనాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలి. ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా చూడాలి. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను గుర్తిస్తే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించాల్సి ఉంది. అయితే ఆ దిశగా పెట్రోలింగ్‌ వాహనాలు పనిచేయడంలేదు. సిబ్బంది వాహనాన్ని ఎక్కడో ఒకచోట నిలుపుకుని కాసులవేటలో నిమగ్నమయ్యారనే విమర్శలున్నా యి. ఇసుక, గ్రానైట్, అక్రమ రవాణా చేసే వారి నుంచి, పశువులను రవాణా చేసే వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి. పోలీ సు నిఘా వైఫల్యాన్ని పసిగట్టిన దుండగులు పోలీసు గస్తీ లేని ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జాతీయ రహదారి వెంబడి గస్తీని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.  

మరిన్ని వార్తలు