బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

5 Jul, 2019 09:57 IST|Sakshi
బాల్య వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు,పోలీసులు

సాక్షి, బల్లికురవ (ప్రకాశం): మైనర్‌ బాలికకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న సంతమాగులూరు ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు సిబ్బందితో కలిసి బాల్య వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి బల్లికురవ ఎస్సీ కాలనీలో వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం ఎస్సీ కాలనీకి చెందిన బొంతా శ్యాంబాబు, బాణమ్మల కుమార్తె కోమలి ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకుంది. ఇంటర్మీడియట్‌ చదువుతానని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు తమ వద్ద చదివించే స్థోమత లేదని గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన ఇండ్ల కృష్టోఫర్‌ సింగమ్మల కుమారుడు ప్రభాకర్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు.

శుక్రవారం ఉదయం జొన్నలగడ్డలో వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐతే, గురువారం రాత్రి బాలిక ఇంటి వద్ద వివాహ వేడుకలు జరుగుతుండగా అధికారులకు మైనర్‌ వివాహం జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో సంతమాగులూరు ఐసీడీఎస్‌ సీడీపీఓ బి. విజయలక్ష్మి, సూపర్‌వైజర్‌ వి. నాగమణి, అంగన్‌వాడీ కార్యకర్త కె. రాజకుమారి బల్లికురవ ఎస్సై పి. అంకమ్మరావు, వివాహ వేడుకలు జరుగుతున్న బాలిక ఇంటివద్దకు వెళ్లారు.

బాలికతోనూ, తల్లిదండ్రులతోనూ వేర్వేరుగా మాట్లాడారు. బాలిక తాను ఇంటర్‌ చదువుతానని, చదివించాలని, అధికారులను వేడుకుంది. మేజర్‌ అయ్యే వరకు వివాహం చేయమని బాలిక తల్లిదండ్రులు శ్యాంబాబు, బాణమ్మల నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. బాలిక నుంచి కూడా మేజర్‌ అయ్యేవరకు వివాహం చేసుకోనని స్టేట్‌మెంట్‌ తీసుకుని, బల్లికురవ కళాశాలలో చేర్పించాల్సిందిగా అంగన్‌వాడీ కార్యకర్తను ఆదేశించారు.

మరిన్ని వార్తలు