కిర్లంపూడిలో భారీ పోలీసు బందోబస్తు

28 Jan, 2019 07:38 IST|Sakshi
ముద్రగడ ఇంటి గేటు ముందు ఆర్‌అండ్‌బీ విద్యుత్‌ స్తంభానికి అమర్చిన సీసీ కెమెరాలు (వృత్తంలో)

తరలివచ్చిన డివిజన్‌లోని పోలీసు సిబ్బంది  

ముద్రగడ ఇంటి గేటు ముందు సీసీ కెమెరాల ఏర్పాటు

తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో నిర్వహించ తలపట్టిన ‘చలో కత్తిపూడి జేఏసి సమావేశం’ను  దృష్టిలో ఉంచుకొని కిర్లంపూడిలో భారీ పోలీస్‌ బందోబస్తు చేస్తున్నారు. గతంలో జరిగిన తుని సంఘటనను దృష్టిలో ఉంచుకొని ముద్రగడ చేపట్టిన కత్తిపూడి సమావేశాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామానికి చేరుకుంటున్న పోలీసు బలగాలను చూస్తుంటే ఏ క్షణంలోనైనా ముద్రగడను గృహనిర్బంధం చేయవచ్చని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  శనివారం రాత్రి పెద్దాపురం డివిజన్‌ పరిధిలోని పోలీసు సిబ్బంది కిర్లంపూడి చేరుకున్నారు.

పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌ రామారావు, జగ్గంపేట, తుని టౌన్‌ సీఐలు వై.రాంబాబు, వి.శ్రీనివాస్, స్థానిక ఎస్సై డి.నరేష్‌తో పాటు ఎస్సైలు పార్థసారథి, రామకృష్ణ,  పోలీసులు కిర్లంపూడిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సోమవారం నాటికి భారీ సంఖ్యలో పోలీసులు  కిర్లంపూడి చేరుకుంటారని సమాచారం. ముద్రగడ పద్మనాభం ఇంటి బయట ఉన్న గేటు వద్ద శనివారం సాయంత్రం నుంచి ఎస్సై స్థాయి అధికారితో పాటు 10మంది పోలీసు సిబ్బంది మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. ముద్రగడ ఇంటి గేటు ఎదుట ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభానికి శనివారం సాయంత్రం మూడు సీసీ కెమెరాలను అమర్చారు. స్థానిక సత్యదేవా కల్యాణమండపంలో టెంట్‌లను వేశారు. మళ్లీ పోలీసు బలగాలు కిర్లంపూడి రావడంతో ఏక్షణాన ఏంజరుగుతుందోనని
గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

కాపు నాయకుల అరెస్టు
కొత్తపల్లి (పిఠాపురం): తమను వ్యతిరేకించే కాపునాయకులను ఎలాగైనా లొంగదీసుకోవాలని అధికారపార్టీ కుయుక్తులు పన్నుతోంది. అధికార దండంతో వారిని బెదిరిస్తోంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 31వ తేదీన కత్తిపూడిలో నిర్వహించనున్న కాపు మహాసభను అడ్డుకునే చర్యల్లో భాగంగా గొల్లప్రోలు మండలంలోని పలువురు నాయకులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని కొత్తపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అరెస్టు అయిన వారిలో మొగలి అయ్యారావు, ఎస్‌.సత్యనారాయణరాజు, డి.వెంకటేష్‌ ఉన్నారు. స్థానిక కాపునాయకులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, మారిశెట్టి శ్రీను, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు జీలకర్ర సత్తిబాబు వారిని పోలీసు స్టేషన్‌లో కలసి సంఘీభావం తెలిపారు. అయ్యారావు మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు చేసినంత మాత్రాన ఈ సభ ఆగదన్నారు. పని ఉంది రమ్మని చెప్పిన పోలీసులు అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా