నగదు, మద్యం స్వాధీనం

6 Apr, 2019 14:38 IST|Sakshi
సరుబుజ్జిలి: సీజ్‌ చేసిన మద్యం బాటిళ్లు

జిల్లాలో పలుచోట్ల ముమ్మర  తనిఖీలు

సాక్షి, వీరఘట్టం (శ్రీకాకుళం): మండలంలోని రేగులపాడు సమీపంలో శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆధారాల్లేని రూ.1.50 లక్షలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ జి.సుబ్రహ్మణ్యం పట్టుకున్నారు. వీరఘట్టం మండలం చలివేంద్రికి చెందిన అలజంగి కృష్ణ ఎల్‌ఐసీ ప్రీమియం కట్టేందుకు ఈ డబ్బులు తీసుకువెళుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు అతని వద్ద లేవని పోలీసులు తెలిపారు. ఈ నగదును పోలీసులకు అప్పజెప్పడంతో ఎస్‌ఐ జి.అప్పారావు కేసు నమోదు చేశారు.

714 మద్యం బాటిళ్లు సీజ్‌
సరుబుజ్జిలి: అనధికారకంగా రవాణా జరుగుతున్న మద్యం బాటిళ్లను సరుబుజ్జిలి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సరుబుజ్జిలి ఎస్‌ఐ డి.విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బృందం సభ్యులు అలికాం–బత్తిలి రహదారిలో తనిఖీలు చేస్తుండా 714 క్వార్టర్‌ బాటిళ్లు పట్టుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ కోసం ఈ మద్యం తరలిస్తున్నట్లు అనుమానం వచ్చి సరకును సీజ్‌ చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు గురుమూర్తి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

నందిగాంలో రూ.68,000..
నందిగాం: ఎన్నికల నిర్వహణలో భాగంగా  మండల పరిధిలో కొత్తగ్రహారం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీల్లో అనధికారంగా ఉన్న రూ.68,000 పట్టుబడిందని నందిగాం ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక సిబ్బంది శేషు, దేవదాయశాఖ ఈఓ గురునాథ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతుండగా భువనేశ్వర్‌ నుంచి జైపూర్‌ వెళ్తున్న కారులో రూ.68వేలను గుర్తించారన్నారు. కారు యజమాని ఎల్‌.వి.ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని నగదను స్టేషన్‌కు తరలించామన్నారు.

వెంకటాపురంలో రూ.51,500.. 
లావేరు: మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అనధికారికంగా తీసుకువెళుతున్న రూ.51,500 నగదును అధికారులు పట్టుకున్నారు. చెక్‌పోస్టు ఇన్‌చార్జి అల్లు సోమేశ్వరరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం చెక్‌పోస్టు ఇన్‌చార్జి అల్లు సోమేశ్వరరావు, వీఆర్‌వో కిరణ్మయి, లావేరు పోలీసులు వాహనాలు తనిఖీ చేపడుతుండగా మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన కోరాడ సాయిబాబు ద్విచక్రవాహనంతో నగదును తీసుకుని వెళుతుండగా తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. నగదు ఎలా వచ్చిందో అధికారులకు సరైన ఆధారాలను వెంటనే చూపించలేదన్నారు. దీనిపై లావేరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇచ్ఛాపురంలో రూ..2,38,500..
ఇచ్ఛాపురం: ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం చెక్‌పోస్టు, ముశ్చింద్ర చెక్‌పోస్టుల వద్ద ఎస్‌ఎస్‌టీ, ఫ్లైయింగ్‌ స్క్వాడ్, పోలీస్‌ సిబ్బంది శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల్లో  అనధికారంగా తరలిస్తున్న రూ.2,38,500 నగదును పట్టుకున్నారు. ఎస్‌ఎస్‌టీ, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ తెలిపిన వివరాల మేరకు  పురుషోత్తపురం చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాలోని బరంపూర్‌ నుంచి కొరాపుట్‌కు బోలెరో వాహనంలో వెళ్తున్న ఉమాశంకర్‌ సాహు వద్ద రూ.78,000, సుజ్జీవ్‌సుబిద్ధి వద్ద రూ.52,500, కేసి పాణిగ్రాహి వద్ద రూ.50,000 ఉన్నట్లు గుర్తించారు.

ఆ నగదుకు సంబంధించిన సరైన పత్రాలకు చూపకపోవడంతో సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఎస్‌టీ ఎం.గణపతి తెలిపారు. ముశ్చింద్ర గ్రామం పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న  రూ.58,000 నగదును పోలీసీలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశం సీఐ కె.పైడపునాయుడు మాట్లాడుతూ సరైన ఆధారాలు లేకుండా రాజకీయ పార్టీ కరపత్రాలు, జెండాలు తరలించవద్దన్నారు. ఎటువంటి మారణాయుధాలు ఉండరాదన్నారు. పట్టణ ఎస్‌ఐ సింహాచలం, రూరల్‌ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు