భారీ స్థాయిలో పట్టుబడిన నకిలీ సిగరెట్లు

13 Dec, 2019 12:34 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ : బ్రాండెడ్‌ సిగరెట్ల పేరుతో నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని భవానీపురంలో సూరా వెంకటేశ్వరరావుకు చెందిన చిన్న గౌడౌన్‌లో నకిలీ సిగరెట్లు నిల్వ ఉంచి, అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు స్పందించి సోదాలు నిర్వహించగా, రూ. 15 లక్షలు విలువ చేసే 75,800 ప్యాకెట్లను గుర్తించారు. గోల్డ్‌ స్టెప్‌, గోల్డ్‌ విమల్‌ అనే పేర్లతో ప్యాకెట్లు ముద్రించి వాటిలో స్థానికంగా తయారయ్యే నాసిరకం సిగరెట్లను నింపి వినియోగదారులను మోసం చేశారని వెల్లడించారు. ఒరిజనల్‌ ప్యాకెట్‌ మూడు వందలు ఉంటే ఈ నకిలీ సిగరెట్లను సగం ధరకే విక్రయిస్తున్నారు. గత రెండు నెలలుగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా విక్రయించిన ఈ సిగరెట్లను బీహార్‌ నుంచి తెచ్చినట్టు వెంకటేశ్వరరావు చెప్పారని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వరరావుపై గతంలో గుంటూరులో గుట్కా రవాణా కేసు నమోదైందని, అనంతరం బెయిల్‌పై బయటికొచ్చి, నకిలీ సిగరెట్ల దందా ప్రారంభించాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి విచారస్తున్నామని డీసీపీ పాటిల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు