ఏవోబీలో భారీ డంప్‌ స్వాధీనం

8 Feb, 2020 13:20 IST|Sakshi
చిత్రకొండ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల డంప్‌

సీలేరు (పాడేరు):విశాఖ ఏజెన్సీ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కటాఫ్‌ ఏరియాలో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ డంప్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు, మిలీషియా సభ్యులు ఎదురు కాల్పుల్లో చనిపోవడం, కొందరు పోలీసులకు లొంగిపోతున్నారు. ఈ తరుణంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీసుస్టేషను పరిధిలో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని ఏపీ, ఒడిశా పారామిలటరీ జాయింట్‌ ఆపరేషన్‌ భారీ డంప్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. లైట్‌ మెషీన్‌ గన్, 3 ఇన్సాస్‌ 3 కార్బన్, 1 ఎస్‌ఎల్‌ఆర్, 303– పిస్టల్, భారీగా బుల్లెట్లు, వీహెచ్‌ఎఫ్‌ సెట్, టిఫిన్‌ క్యారియర్‌ బాంబు, గన్‌ ఫౌడర్, పలు పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

అగ్రనేతల కోసం ముమ్మర గాలింపు  
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కటాఫ్‌ ఏరియాలో మావో యిస్టు అగ్రనేతలు తలదాచుకున్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే సైతం ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ నివేదిక ద్వారా ఒడిశా పోలీసులు పది రోజుల కింద పత్రిక ప్రకటన చేశారు. అలాగే దళపతి, అరుణ తదితరులు ఉన్నారని, ఎలాగైనా వారిని పట్టుకోవాలని ఇరు రాష్ట్రాల బలగాలు ముమ్మర గాలింపు చేపడుతూ కూంబింగ్‌ చేపడుతున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డంప్‌ను కూడా ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టుల ద్వారానే తెలుసుకున్నట్లు సమాచారం ఉంది. భారీగా లభ్యమైన పేలుడు పదార్ధాలు గతంలో ఒడిశా ప్రాంతంలోని పోలీసు స్టేషన్లపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న సామాగ్రి అని భావిస్తున్నప్పటికి వాటిని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. మరోసారి మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగలడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు