ఖాకీలకూ నో ఎంట్రీ!  

9 Apr, 2019 12:25 IST|Sakshi

సాక్షి, సత్తెనపల్లి : ఎన్నికల విధుల్లో పబ్లిక్‌ సర్వెంట్‌ అనే పదానికి సాధారణ అర్థం పోలీస్‌ అధికారి అని కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. యూనిఫామ్‌లో ఉన్నా .. లేకున్నా పోలీసులు తమ విధుల్లో భాగంగానైనా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. అవసరమైన పక్షంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ఏ ప్రత్యేక కారణం లేకుండా పోలీసులకు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడానికి అనుమతి లేదు. 

  • పోటీ చేసే అభ్యర్థి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఆయన ఒక్కరే లోపలికి వెళ్లాలి. భద్రతా సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి. ఎన్నికల విధులలో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పని ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, స్పీకర్‌ కానీ, వారి అనుచరులు కానీ చేయరాదు. 
  •  పోటీల్లో  ఉన్న అభ్యర్థికి జెడ్‌ప్లస్‌ క్యాటగిరి రక్షణ ఉన్నా.. వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టిలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్‌ మంత్రులు, ఉప మంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. 
  • పోలింగ్‌ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోకూడదు. సిబ్బంది ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం ఆజ్ఞాపత్రం ఉంటేనే పోలింగ్‌  కేంద్రాల్లోకి అనుమతించాలి.
  • పదవుల్లో ఉన్న వారు, పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించినా, మాటలు, సైగలు చేసినా అది నేరం గానే పరిగణిస్తారు. 

వెబ్‌కాస్టింగ్‌తో పారదర్శకత   
ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ విధానాన్ని అములు చేయనున్నారు. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పోలింగ్‌ కేంద్రాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. దీని ద్వారా ప్రతి క్షణం ఓటింగ్‌ ప్రక్రియ..అవాంఛనీయ ఘటన వివరాలను నేరుగా తెలుసుకునే వీలుంటుంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచే పోలింగ్‌ ప్రక్రియను వీక్షించే సౌకర్యం ఉంటుంది. పోలింగ్‌ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిపించడమే దీని లక్ష్యం.  

మరిన్ని వార్తలు