అలసిపోతున్న నాలుగో సింహం

23 May, 2018 08:57 IST|Sakshi

తీవ్ర ఒత్తిళ్ల మధ్య ఖాకీల విధులు

సెలవులడగాలంటేనే భయం

వారాంతపు సెలవులపై దృష్టి పెట్టని ఎస్పీలు

దారితప్పుతున్న ఆర్ముడు రిజర్వు వ్యవస్థ

రాజశేఖర్‌ మరణమైనా కళ్లు తెరిపించేనా?

సెలవు.. ప్రభుత్వ ఉద్యోగి హక్కు. అత్యవసర సేవల్లాంటి పోలీసు విభాగంలో సెలవు పేరెత్తే అర్హత ఏ ఒక్కరికీ ఉండదు. ఎండలో నిలబడి ట్రాఫిక్‌ విధులు, అడవుల్లో కూంబింగ్, ఇతర రాష్ట్రాల్లో ఎర్రచందనం స్మగ్లర్ల వేట, ఆర్‌ఐల వద్ద ఆర్డర్లీ డ్యూటీలు.. ఇన్నింటి నుంచి కాస్త ఉపశమనం ఇచ్చే వారాంతపు సెలవుజిల్లాలోని ఏ ఒక్క కానిస్టేబుల్‌కు అమలుకావడం లేదు. ఇదే సెలవు మంజూరుకాక చిత్తూరులో పనిచేసే కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ గత సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అధికారుల ఆలోచనా విధానాన్ని మార్చాలని పోలీసులు బయటకు చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నారు.

చిత్తూరు అర్బన్‌: వేళాపాళాలేని విధుల్లో నలిగిపోతున్న పోలీసులు వ్యక్తిగత జీవితానికి ఎప్పుడో దూరమైపోయారు. ఇంట్లో తల్లిదండ్రులు, భార్య పిల్లలకు ప్రేమను పంచడం, వాళ్ల ప్రేమను పొందడం అసాధ్యం అనే స్థితిలో ఉండిపోయారు. ఆదివారం వస్తే కుటుంబ సభ్యులతో సరదాగా ఓ సినిమా, పార్కుకు వెళదామంటే కుదరని పరిస్థితి. పిల్లలు ఏం చదువుతున్నారు..? ఎవరితో తిరుగుతున్నారు.? వారి ఇష్టాఇష్టాలు తెలుసుకునే పరిస్థితి కూడా చాలా మందికి ఉండడం లేదు. కొన్నిసార్లు పనిలో అధికారుల నుంచి ఎదురయ్యే చీవాట్లు, ఛీత్కారాలను ఇంట్లో భార్యాపిల్లలపై చూపించేవాళ్లు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. తండ్రి కుటుంబంపై దృష్టి పెట్టకపోవడంతో చెడుదారిని ఎంచుకునే  పిల్లలూ ఉన్నారు. చిత్తూరులో ఓ ఏఎస్‌ఐ కొడుకు తొమ్మిదో తరగతిలోనే తోటి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి జువైనెల్‌హోమ్‌కు తరలించడమే ఇందుకు నిదర్శనం.

ఏఆర్‌ ప్రక్షాళన ఎప్పుడో?
సివిల్‌ పోలీసులతో పోలిస్తే ఆర్ముడు  రిజర్వు (ఏఆర్‌) విభాగంలోని కానిస్టేబుళ్లకు కాస్త తీరిక ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ వాస్తవంగా చూస్తే  ఎక్కువ మంది సిబ్బంది అణిచివేత కు గురయ్యేది ఏఆర్‌ విభాగంలోనే. అంతర్‌ జిల్లా ల నుంచి ఇక్కడ విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు పండగలకు, పబ్బాలకు నాలుగు రోజులు సెలవు అడిగితే డీఎస్పీ నుంచి ఆర్‌ఐ వరకు అగ్గిమీద గు గ్గిలమవుతారు. ప్రముఖుల వద్ద గన్‌మాన్‌ డ్యూటీలు కావాలంటే ఇక్కడ పనిచేసే అధికారులకు నెలసరి మామూళ్లు ఇవ్వాల్సిందే. ఏదైనా పనిష్‌మెం ట్లు ఉన్న కానిస్టేబుళ్లు వాటిని క్లియర్‌ చేసుకో వాలన్నా పైసలు ముట్టజెప్పాల్సిందే. ఇన్ని అభియోగాలు, ఆరోపణలు వస్తున్నా ఏఆర్‌ విభాగంలో ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయిన అధికారులను బదిలీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఒత్తిడితో విధులు..
చిత్తూరు, తిరుపతి పోలీస్‌ జిల్లాల్లో రెండు వేర్వేరు సమయాల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. చిత్తూరు నగరంలోని స్టేషన్లలో ఓ కానిస్టేబుల్‌ ఉదయం ఏడు గంటలకు డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వెళతాడు.

ఇదే వ్యక్తి రాత్రి 9 గంటలకు డ్యూటీ ఎక్కి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు స్టేషన్లలో పనులు చేయాలి. 24 గంటల్లో 16 గంటల పాటు స్టేషన్‌లో ఉండాల్సిందే. మిగిలిన ఎనిమిది గంటల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, స్టేషన్‌కు వెళ్లే సమయం రెండు గంటలవుతుంది. ఉన్న ఆరు గంటలు నిద్రపో వాలి. ఇంతలో మళ్లీ స్టేషన్‌ నుంచి కబురొస్తే వెళ్లాలి. ఇలాంటి టైమ్‌ టేబుల్‌లో సగటు కానిస్టేబుల్‌ కుటుంబంతో గంట కూడా గడపలేని పరిస్థితి. ఏఆర్‌ విభాగంలో ఇదే పరిస్థితి. 24 గంటల్లో మూడు గంటలు చొప్పున రెండుమార్లు విశ్రాంతి తీసుకుని విధులు ఉన్నా, లేకున్నా హెడ్‌ క్వార్టర్‌లో ఉండాల్సిన దుస్థితి.  
డీజీ దృష్టికి తీసుకెళ్తాం
మాకూ తప్పనిసరిగా వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాల్సిందే. అ త్యవసరం అంటే చెప్పం డి.. చేస్తాం. కానీ వీక్లీ ఆఫ్‌ ఇవ్వడం వల్ల కుటుంబం తో కొద్దిసేపు గడిపే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఈ విషయం ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై డీజీని కలిసి వినతి ఇస్తున్నాం. మా సెలవులు మాకు తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం. అధికారులు కూడా ఓసారి మావైపు నుంచి ఆలోచిస్తే అర్థమవుతుంది.          – టి.గోపాల్,తిరుపతి అర్బన్‌ పోలీసు సంఘ అధ్యక్షులు

మరిన్ని వార్తలు