‘చలో వంశధార’పై ఉక్కుపాదం!

10 Oct, 2017 08:32 IST|Sakshi
శ్రీకాకుళంలో తేజేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు , హిరమండలంలో మోహరించిన పోలీసు బలగాలు

ప్రతిపక్ష నాయకులపై ‘పోలీసు’ అస్త్రం

రెండ్రోజుల ముందు నుంచే అరెస్టులు మొదలు

హిరమండలంలో భారీగా బలగాల మోహరింపు

నిర్వాసిత గ్రామాల్లో అడుగడుగునా నిఘా

30 యాక్ట్‌ ఆంక్షలే అస్త్రంగా అణచివేత చర్యలు

కీలక నేతల హౌస్‌ అరెస్టులకూ రంగం సిద్ధం

చౌదరి తేజేశ్వరరావు... ప్రజల సమస్యలపై పోరాటానికి 80 ఏళ్ల వయస్సులోనూ ముందుండే వామపక్ష నాయకుడు! కానీ ఉద్యమం ఏదైనా సరే ఆయన రోడ్డెక్కగానే అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తీసుకుపోవడం పోలీసులకు గత మూడేళ్ల కాలంలో ఆనవాయితీగా మారింది! అయితే ఈసారి సీన్‌ మారింది! వంశధార నిర్వాసితులపై చంద్రబాబు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టడానికి విపక్షాలన్నీ 10వ తేదీన ‘చలో వంశధార’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే! దీన్ని భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే ముందస్తు అరెస్టులకు తెరతీశారు. చౌదరి తేజేశ్వరరావును ఒక్కరోజు ముందే అంటే సోమవారం ఉదయమే ముందస్తుగా అరెస్టు చేశారు. ఎప్పటిలాగే శ్రీకాకుళం శివారులోని గార పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్తారనుకుంటే ఈసారి మాత్రం పలు పోలీసుస్టేషన్లకు తిప్పి తిప్పీ చివరకు వంద కిలోమీటర్ల దూరంలో, ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు! ఇలా ఆయన ఒక్కరే కాదు వృద్ధులు, యువకులు అనే తేడా లేకుండా సర్కారు నిరంకుశ వైఖరిపై ఎవ్వరు గళమెత్తినా గొంతు నొక్కేయడానికి ప్రభుత్వం పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తూ వస్తోంది. ఇప్పుడు ‘ఛలో వంశధార’ విషయంలోనూ అదే మార్గాన్ని ఎంచుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు రానున్నాయనే సంకేతాలు అందుతున్న వేళ! ఈ మూడున్నరేళ్లలో తాము చేశామని చెప్పుకోవడానికి టీడీపీ ప్రభుత్వానికి ఏమీ కనబడట్లేదు. ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలకు తోడు జిల్లాకు ఒక్కటంటే ఒక్క పెద్ద ప్రాజెక్టునూ తీసుకురాలేకపోయిన సమయంలో వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌ –2 కనిపించింది. కరువు కాటకాలతో, వలసలతో అల్లాడిపోతున్న సిక్కోలు జిల్లాను మండువేసవిలోనూ గలగల జలాలు పారించి రెండు పంటలతో సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తలపెట్టిన ఈ ప్రాజెక్టును తమ ఖాతాలో వేసుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. జవనరి 5న ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే మరోవైపు నిర్వాసితుల సమస్యలు ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారమవ్వలేదు. కానీ ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను ఖాళీ చేయించడానికి పోలీసు బలాన్నే ప్రభుత్వం ఎంచుకుంది. నిర్వాసితుల తరఫున కాస్తోకూస్తో ప్రశ్నించేవాళ్లను గత జనవరిలో, ఆగస్టులో జరిగిన దాడుల కేసుల్లో ఇరికించి ఇప్పటికే జైళ్ల పాల్జేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా సువిశాల ప్రయోజనాల కోసం తమ ఆస్తులు త్యాగం చేసిన తాము వంశధార ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, తమ సమస్యలన్నీ పరిష్కరిస్తే తామే స్వచ్ఛందంగా వెళ్లిపోతామని నిర్వాసితులు చెబుతున్నారు. కానీ వారి మాట వినే నాథుడే అధికార పార్టీలో కరువయ్యారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య, దుందుడుకు వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా విపక్షాలన్నీ ఈ నెల 10వ తేదీన ‘ఛలో వంశధార’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.

గ్రామాల నేలమట్టం...
వంశధార నిర్వాసితులకు నిర్వాసిత కాలనీల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, పరిహారాల చెల్లింపు చాలావరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే చాలావరకూ పూర్తయ్యింది. ఆయన హయాంలో ఏర్పాటు చేసిన కాలనీలే తప్ప టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన నిర్వాసితుల కోసం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. చివరి నిమిషంలో ఇల్లు నిర్మాణానికి, ఇంటి స్థలానికి కలిపి రూ.5 లక్షల చొప్పున సొమ్ము చేతుల్లో పెట్టింది. కొంతమందికి స్థలాలు కేటాయించినా ఆ సొమ్ము అక్కడున్న గోతులు పూడ్చుకోవడానికీ సరిపోదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీసం ప్రత్యామ్నాయంగా వేరే అద్దె ఇల్లు చూసుకోవడానికి, పిల్లలను పాఠశాలలను మార్పించుకోవడానికి వచ్చే వేసవి వరకైనా సమయం కావాలని నిర్వాసితులు మొత్తుకున్నా సర్కారు చెవికెక్కలేదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో పాలకులు లేరని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇదిలాఉండగానే ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం తాఖీదులు పంపించింది.

మూడ్రోజుల క్రితమే చిన్నకొల్లువలస గ్రామంలో ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఈనెలాఖరుకు గార్లపాడును లక్ష్యంగా చేసుకున్నారు. తర్వాత పాడలి, దుగ్గుపురం, తులగాం గ్రామాల నుంచి నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో వరిపొలాల ధ్వంసానికి అడ్డుకట్ట పడినా కనీసం ఆ పంట చేతికొచ్చేవరకూ గ్రామాల్లో ఉండనిచ్చేలా లేరని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి కానీ, మరెక్కడికైనా వెళ్లి అద్దె ఇళ్లలోకి వెళ్లడానికి ముహూర్తాలు లేవని, తమ డిమాండ్లను ఎలాగూ పరిష్కరించలేదు కనీసం సెంట్‌మెంట్‌నైనా గౌరవించాలని ప్రాథేయపడినా వినేవారే కరువయ్యారని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక జైళ్లలో ఉన్న నిర్వాసితుల కుటుంబాల వారికైతే ఎటూపాలుపోక ఆందోళన చెందుతున్నారు.

సెక్షన్‌ 30 ఆంక్షలతో అణచివేత...
స్వాతంత్య్రానికి పూర్వం ఉద్యమాలను అణచివేయడానికి బ్రిటిష్‌ పాలకులు తీసుకొచ్చిన పోలీసు యాక్ట్‌ సెక్షన్‌ 30 నిబంధనలను టీడీపీ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. గత మూడేళ్లుగా హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి ఎవ్వరు గొంతు వినిపించినా అణచివేయడానికి ఈ సెక్షన్‌నే ఉపయోగిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో దుర్వినియోగం చేస్తోందని వైఎస్సార్‌సీపీ సహా విపక్ష నాయకులు ప్రశ్నించినా అధికార టీడీపీలో చలనం కూడా కనిపించట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం గత ఏడాదంతా వైఎస్సార్‌ సీపీ చేసిన ఆందోళనలను, బంద్‌లను అడ్డుకోవడానికి ఈ సెక్షన్‌తో పాటు 144 సెక్షన్‌నూ సర్కారు అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ‘చలో వంశధార’ ఆందోళన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కూడా అవే అస్త్రాలను ప్రయోగిస్తోంది. హిరమండలం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. నిర్వాసిత గ్రామాల్లో గట్టి నిఘా ఉంచింది. మరోవైపు జిల్లాకు వచ్చే రోడ్డు మార్గాల్లో వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులెవ్వరూ హిరమండలం చేరకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

నాయకత్వం లేకుండా చేయాలనే...
‘చలో వంశధార’ ఆందోళనలో రాష్ట్రస్థాయి విపక్ష నాయకులంతా పాల్గొనే అవకాశం ఉందని నిఘావర్గాలు ఇప్పటికే నివేదించాయి. దీనికంటే ముందు జిల్లాస్థాయి నాయకులను కట్టడి చేయడానికి పోలీసు బలాన్ని ప్రభుత్వం ఉపయోగించింది. గత ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వామపక్ష నేతలనూ సోమవారం ఉదయం నుంచే అదుపులోకి తీసుకొనే చర్యలకు తెరతీసింది. మరికొంతమంది నాయకుల ఇళ్ల వద్ద నిఘా పెట్టింది. ఉద్యమాలకు నాయకత్వం, మార్గదర్శకత్వం వహించేవారిని కట్టడి చేసి ఆందోళనకు అడ్డుకట్ట వేయాలన్న ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి చేష్టలతో ప్రజాఉద్యమాలను అణచివేయాలనుకుంటే అవివేకమే అవుతుందని హెచ్చరిస్తున్నారు.

ముందస్తు అరెస్టులు షురూ...
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావుతో పాటు డి.గణేష్, కె.నాగమణి, దావాల రమణ, వై.గేయమూర్తి, సీపీఐ రాష్ట్ర నాయకుడు చాపర సుందరలాల్, కృష్ణవేణి, రైతుకూలీ సంఘం నాయకురాలు తాండ్ర అరుణమ్మ, మానవ హక్కుల వేదిక నాయకుడు కేవీ జగన్నాథరావు తదితరులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని రాత్రి ఇచ్ఛాపురం పోలీసుస్టేషన్‌లోనే ఉంచారు. గంగరాపు ఈశ్వరమ్మతో పాటు జిల్లావ్యాప్తంగా మరికొంతమంది వామపక్ష నాయకులను హౌస్‌ అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. ఏదిఏమైనా నిర్వాసితులకు మద్దతుగా తలపెట్టిన ‘చలో వంశధార’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు.  

ప్రభుత్వ వైఖరి సరికాదు
వంశధార నిర్వాసితుల త్యాగాలను గుర్తించకుండా వారినీ, వారికి మద్దతుగా ‘చలో వంశధార’ ఆందోళనకు పిలుపునిచ్చిన విపక్ష నాయకులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరి సరికాదు. ప్రజాస్వామ్యాన్ని పోలీసు రాజ్యంగా మార్చేసిన టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీలు, బకాయిలు అందజేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కానీ ప్రాజెక్టు పనులు ఇంకా కొలిక్కిరాక మునుపే, నిర్వాసితులు వేరేచోట ఆశ్రయం వెతుక్కోకముందే వారి ఇళ్లను కూల్చేయడం బాధాకరం. కేవలం నిర్వాసితులకు భూసేకరణ చట్టం 2013 నిబంధనలు అక్కరకు గాకుండా చేయడానికే ఇలాంటి దుందుడుకు చర్యలకు ప్రభుత్వం దిగుతోంది.
– రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

>
మరిన్ని వార్తలు