గళాలకు సంకెళ్లు!

22 Nov, 2018 04:29 IST|Sakshi
మంగళగిరిలో ఆందోళనకారుడిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు

అగ్రిగోల్డ్‌ బాధితులపై ఉక్కుపాదం

‘చలో హాయ్‌ల్యాండ్‌’ను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు

ముట్టడికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు..జాతీయ రహదారిపై అణువణువునా తనిఖీలు.. వాహనదారుల ఇక్కట్లు 

అగ్రిగోల్డ్‌ బాధితులకు మద్దతుగా గుంటూరులో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ..గృహ నిర్బంధంలో పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి 

లెఫ్ట్‌ నేతలు మధు, రామకృష్ణ తదితరుల అరెస్టు 

నల్లపాడు పోలీసుస్టేషన్, తాడేపల్లిలో బాధితుల ధర్నా 

ఉరేసుకుంటామంటూ తాళ్లతో మహిళల ఆందోళన

సాక్షి, గుంటూరు/ సాక్షి, అమరావతి/ నెట్‌వర్క్‌: అడుగడుగునా పోలీసులు... గజానికో బారికేడ్‌.. హాయ్‌ల్యాండ్‌ చుట్టూ 15 చెక్‌పోస్టులు... మిలటరీ దుస్తుల్లో భుజాన తుపాకులతో రిజర్వ్‌ పోలీసు బలగాలు... ‘అగ్రిగోల్డ్‌’, ‘హాయ్‌ల్యాండ్‌’.. అనే పేర్లు వినపడితే చాలు కన్నెర్ర చేస్తూ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలింపు!..

ఇవీ బుధవారం విజయవాడ – గుంటూరు జాతీయ రహదారిపై కనిపించిన దృశ్యాలు. రాజధాని సమీపంలోని హాయ్‌ల్యాండ్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అణువణువూ తనిఖీ చేశారు. హాయ్‌ల్యాండ్‌ వద్దకు ఎవరూ వెళ్లకుండా సెలవు ప్రకటిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు, వామపక్షాలు, వైఎస్సార్‌ సీపీ నేతలను అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీసు స్టేషన్‌లకు తరలించారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వ్యానుల్లోకి గెంటేశారు. 

ఉరితాళ్లతో మహిళల ఆందోళన
అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, వినియోగదారుల సంక్షేమ సంఘం చేపట్టిన ‘చలో హాయ్‌ల్యాండ్‌’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరులోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు చేరుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కన్నుగప్పి హాయ్‌ల్యాండ్‌ వద్దకు వచ్చిన ఏలూరుకు చెందిన వృద్ధురాలిని అడ్డుకుని  ఆటోలో తాడేపల్లి తరలించారు. మంగళగిరి ‘వై’ జంక్షన్‌ వద్ద పోలీసులను ప్రతిఘటించిన బాధిత మహిళలు తమను అరెస్ట్‌ చేస్తే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ ఉరితాళ్లను పట్టుకుని హెచ్చరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘మా ఆగ్రహ జ్వాలల్లో మాడిమసైపోతావ్‌ చంద్రబాబూ..’ అంటూ మహిళలు శాపనార్ధాలు పెట్టారు. పైసాపైసా కూడబెట్టి డబ్బు దాచుకుంటే తమ కడుపు కొడతారా? అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ‘ఇంత విషం పెట్టి చంపండి.. లేదంటే అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్నైనా ఉరి తీయండి..’ అంటూ ఆక్రోశించారు.

అరెస్టులు, గృహ నిర్బంధం
అగ్రిగోల్డ్‌ బాధితులకు సంఘీభావంగా హాయ్‌ల్యాండ్‌ వద్దకు బయల్దేరిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, హరినాధరెడ్డి, ఏపీ మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులకు బాసటగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ నేత, అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరులో గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. చలో హాయ్‌ల్యాండ్‌’ కార్యక్రమానికి అనుమతి లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా కొంతమందిని అరెస్ట్‌ చేసినట్టు గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. 

తాడేపల్లి కళ్యాణ మండపంలో బాధితుల ధర్నా
గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులు, రోజువారీ కూలీలు, పనుల నిమిత్తం వెళుతున్న వారిని సైతం కిందకు దించి నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు ఆదేశించడంతో అవస్థలు పడ్డారు. హాయ్‌ల్యాండ్‌ ముట్టడి నేపథ్యంలో పోలీసులు మంగళవారం నుంచే పలువురు నేతలు, అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, బాధితులను గృహ నిర్భంధంలోకి తీసుకోవడంతోపాటు నోటీసులు జారీ చేసి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ అగ్రిగోల్డ్‌ బాధితులు హాయ్‌ల్యాండ్‌ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో అరెస్టులు చేసి తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. మరోవైపు హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌ గ్రూపు కంపెనీలకు చెందినదేనంటూ హైకోర్టుకు సమర్పించిన తమ నివేదికను వక్రీకరించడంపై మానసిక వ్యధకు గురైనట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ అల్లూరు వెంకటేశ్వరరావు పేరుతో ప్లెక్సీలను హాయ్‌ల్యాండ్‌ వద్ద ఏర్పాటు చేశారు.  

లెఫ్ట్‌ నేతల అరెస్టులు..
హాయ్‌ల్యాండ్‌ ముట్టడి కార్యక్రమానికి తరలి వస్తున్న పలువురు నేతలు, అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు.  హాయ్‌ల్యాండ్‌కు వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను కనకదుర్గ వారధి వద్ద అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సినీనటుడు నాగినీడులతోపాటు అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, బాధితులను మంగళగిరి వద్ద పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితులు పోలీసు స్టేషన్‌లో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలపై ఆయన మండిపడ్డారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. 

బాధితులకు బాసటగా వైఎస్సార్‌ సీపీ ర్యాలీ
అగ్రిగోల్డ్‌ బాధితులు చేపట్టిన హాయ్‌ల్యాండ్‌ ముట్టడి కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో గృహ నిర్భంధం చేసిన పోలీసులు పార్టీకి చెందిన పలువురు నేతలకు నోటీసులిచ్చారు. హౌస్‌ అరెస్టులో ఉన్న అప్పిరెడ్డిని వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసాగా నిలవకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు లాడ్జి సెంటర్‌ నుంచి శంకర్‌విలాస్‌ సెంటర్‌ వరకు అగ్రిగోల్డ్‌ బాధితులకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు రోజులుగా గృహ నిర్భంధంలో ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంట్‌ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫాలు కలిసి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. 

అగ్రిగోల్డ్‌ బాధితుల ఆక్రోశం
చంద్రబాబుకు అగ్రిగోల్డ్‌ నుంచి పార్టీ ఫండ్‌...చంద్రబాబు నాయుడు 1995లో విజయవాడలో అగ్రిగోల్డ్‌ సంస్థను ప్రారంభించి ఆ సంస్థ నుంచి పార్టీ ఫండ్‌గా కొంత సొమ్ము తీసుకున్నారు. అనంతరం ఆయన హయాంలోనే 2015లో అగ్రిగోల్డ్‌ ప్లేటు ఫిరాయించింది. అనేకసార్లు చర్చలకు పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.11 వేల కోట్లు విడుదల చేసి బాధితులకు న్యాయం చేయాలి.
– విశ్వనాధరెడ్డి, అనంతపురం

ఊళ్లో తలెత్తుకోలేకపోతున్నాం...
అగ్రిగోల్డ్‌లో రూ.60 లక్షల దాకా డబ్బులు కట్టించాం. బాధితులంతా మా ఇంటికి వచ్చి నిలదీయడంతో ఊళ్లో తలెత్తుకోలేకపోతున్నాం. వాళ్లు  అడిగే మాటలకు ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. మా మీద నమ్మకంతో అంత సొమ్ము కట్టిన వారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణం.
– రాజ్యలక్ష్మి, నెల్లూరు

ఉరి తీయాలి...
అగ్రిగోల్డ్‌ సంస్థలో కట్టిన డబ్బులు నా పిల్లాడి వైద్యానికి పనికొస్తాయనుకున్నాం. 2015 జనవరి 1వ తేదీన మా బాబుకు రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మూడు రోజుల్లో డబ్బులొస్తాయి, కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించవచ్చనుకున్నాం. రూపాయి కూడా రాలేదు. ఆపరేషన్‌ చేయించినా మా అబ్బాయి ఆరోగ్యం క్షీణించింది. దీనికి బాధ్యులైన అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని ఉరి తీయాలి.
– భాగ్యవతి, చిత్తూరు

హాయ్‌ల్యాండ్‌పై బాబు కన్ను పడకుంటే న్యాయం జరిగేది..
చంద్రబాబు ఉద్యమం చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులను పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చివరకు కోర్టులను సైతం మభ్యపెడుతూ అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హాయ్‌ల్యాండ్‌పై కన్నేయకుంటే ఈపాటికి బాధితులకు న్యాయం జరిగేది. బాధితులకు అన్యాయం చేస్తే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పటం ఖాయం.
– ఎం.అప్పలనాయుడు (విజయనగరం)

నేరస్తుల్లా దెబ్బలు తినే దుస్థితి కల్పించింది...
పేదలు కష్టపడి సంపాదించిన డబ్బు అగ్రిగోల్డ్‌లో కట్టి మోసపోయారు. న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించి నీరుగార్చింది. సొమ్ము కట్టి మోసపోయింది కాకుండా 
నేడు నేరస్తుల్లా పోలీసులతో దెబ్బలు తినాల్సిన పరిస్థితిని ప్రభుత్వం మాకు కల్పించింది. 
– బి. వెంకాయమ్మ, అగ్రిగోల్డ్‌ బాధితురాలు, తణుకు

పోలీసులను ఉసిగొల్పారు..
అగ్రిగోల్డ్‌కు చెల్లించిన డబ్బులిప్పిస్తామని ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచింది. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ మా కడుపు కొడుతోంది. డబ్బులు ఇప్పించకపోగా పోలీసులను ఉసిగొలిపి చోద్యం చూస్తోంది. అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతాం.  
– జి.వీరలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా

మేం చేసిన తప్పేంటి?
కష్టపడి సంపాదించిన డబ్బు కట్టి మోసపోవడమే మేం చేసిన తప్పా? కడుపుమండి రోడ్లపైకి వస్తే ప్రభుత్వం మాపై పోలీసులను ప్రయోగించి దారుణంగా ప్రవర్తిస్తోంది. శ్రీకాకుళం నుంచి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చా. పోలీసులు నేరస్తుడిలా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. 
– డి.బెహర, శ్రీకాకుళం

ఊరు వదిలి దాక్కుని బతుకుతున్నా...
నేను అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌గా పని చేశా. మా ఊరి ప్రజల నుంచి రూ.50 లక్షల వరకూ డబ్బులు కట్టించా. ఇప్పుడు వాళ్లంతా మా ఇంటి మీద పడుతున్నారు. సమాధానం చెప్పుకోలేక ఊరు వదిలి దాక్కొని బతుకుతున్నా. ఇలా ఇంకా ఎన్ని రోజులు దాక్కొని బతకాలి? ప్రభుత్వం ఇప్పటికైనా అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేసి మాకు డబ్బు చెల్లించి న్యాయం చేయాలి. లేకుంటే చావే శరణ్యం.
– కె. సురేశ్, రాజమండ్రి 

వైఎస్సార్‌సీపీ నాయకుల గృహ నిర్బంధం
అగ్రిగోల్డ్‌ బాధితులు చేపట్టిన హాయ్‌ల్యాండ్‌ ముట్టడి కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో గృహ నిర్భంధం చేసిన పోలీసులు పార్టీకి చెందిన పలువురు నేతలకు నోటీసులిచ్చారు. హౌస్‌ అరెస్టులో ఉన్న అప్పిరెడ్డిని వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసాగా నిలవకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు లాడ్జి సెంటర్‌ నుంచి శంకర్‌విలాస్‌ సెంటర్‌ వరకు అగ్రిగోల్డ్‌ బాధితులకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు రోజులుగా గృహ నిర్భంధంలో ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంట్‌ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫాలు కలిసి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. 

మరో అగ్రిగోల్డ్‌ బాధితుడు మృతి  
మాచర్ల: హాయ్‌ల్యాండ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన ఓ అగ్రిగోల్డ్‌ బాధితుడు మనోవేదనతో మరణించాడు. గుంటూరు జిల్లా మాచర్లలో చిరు వ్యాపారంతో పొట్టపోసుకుంటూ రూపాయిరూపాయి కూడబెట్టి.. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసిన కొమెర గోవిందు (52) బుధవారం కన్నుమూశాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్‌కు చెందిన గోవిందు బడ్డీ కొట్టు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అందులో వచ్చిన కొద్దికొద్ది మొత్తాన్ని రూ.1.70 లక్షల మేర కూడబెట్టి భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అగ్రిగోల్డ్‌ చేతులెత్తేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. న్యాయం జరగకపోతుందా? అని ఇన్నాళ్లూ ఎదురు చూసిన గోవిందు.. హాయ్‌ల్యాండ్‌ తమది కాదంటూ అగ్రిగోల్డ్‌ పిటిషన్‌ వేసినట్లు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

తినోతినకో పొదుపు చేసిన సొమ్ము భవిష్యత్‌లో అక్కరకు వస్తుందని మదుపు చేస్తే.. నిండా మునిగిపోయామని కుమిలిపోయాడు. మూడు రోజులుగా బయటకు రాకుండా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. గోవిందుకు భార్య దుర్గ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు ప్రసాద్‌ బీటెక్‌ పూర్తిచేయగా.. రెండో కుమారుడు శివ డిగ్రీ, కుమార్తె శిరీష ఎంబీఏ చదువుతున్నారు. గోవిందు మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, న్యాయవాదుల సంఘం నాయకులు డేవిడ్‌ రాజు, మార్కొండారెడ్డి, సీపీఐ నేతలు బాలస్వామిరెడ్డి, బాబూరావు తదితరులు అతని ఇంటికి చేరుకొని కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గోవిందు అగ్రిగోల్డ్‌ బాధితుల సమావేశం జరిగిన ప్రతిసారీ పాల్గొనేవాడని.. మూడు, నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆందోళనకు గురై మృతి చెందాడని ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు