పెళ్లి చేసుకుంటామన్న మైనర్లు.. 4 నెలలు ఆగాలన్న పోలీసులు

28 Dec, 2019 19:07 IST|Sakshi

సాక్షి, సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని జాలిమూడికి చెందిన ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకుంటామంటూ పెద్దలను ఎదిరించడంతో ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. జాలిమూడికి చెందిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని గురువారం రాత్రి పెద్దలకు చెప్పారు. 100 నంబర్‌కు కాల్‌ వెళ్లడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న అమ్మాయి, ఎదురింటిలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి ప్రేమించుకుంటున్నారు.

అమ్మాయి తల్లి విదేశాల్లో ఉండడంతో మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. పెళ్లి విషయం వ్యతిరేకించిన మేనమామతో గొడవపడి ఎదురింటిలోని అబ్బాయి ఇంటికి వెళ్లింది. దీంతో గొడవ జరుగుతుందని భావించిన అబ్బాయి తరఫు వారు 100 నంబర్‌కు కాల్‌ చేయడంతో స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి, సర్టిఫికెట్లు పరిశీలించి నాలుగు నెలలో అబ్బాయికి, ఇరవై రోజుల్లో అమ్మాయికి మైనార్టీ తీరుతుందని చెప్పి, ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇరు కుటుంబాలవారు వివాహం చేసేందుకు ఒప్పుకొన్నారు.

చదవండి: స్ర్కీన్‌ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!

మరిన్ని వార్తలు