ఎలక్షన్లలో ‘ఖాకీ’ కలెక్షన్‌ 

14 Jun, 2019 07:47 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ఎన్నికలు ఓటర్లకే కాదు..పోలీసులకూ పండుగగా మారాయా? సహకారం పేరిట భారీగా వివిధ పార్టీల నేతల వద్ద మామూళ్లు తీసుకున్నారా? ఏకంగా ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి కోటి రూపాయలకుపైగా వసూలు చేశారా? అనే విచిత్ర ప్రశ్నలకు అంతే చిత్రంగా అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎన్నికల సమయంలో స్టేషన్ల వారీగా పోలీసులు ఎంత  మొత్తాన్ని వివిధ పార్టీల నుంచి తీసుకున్నారంటూ సేకరించిన వివరాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.

జిల్లావ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకూ వివిధ పార్టీ నేతల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వివరాలను పోలీసు ఉన్నతాధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్లో ఒక్కో కథ బయటకు వచ్చినట్టు సమాచారం. అయితే, బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రం ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి  కోటి రూపాయల మేర తీసుకున్నట్టు తేలడంతో ఉన్నతాధికారులే నోరెళ్లబెట్టినట్టు తెలుస్తోంది.

ఈ నియోజకవర్గంలోని ప్రతీ స్టేషన్లోని పోలీసు సిబ్బందికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్‌ రెడ్డి నుంచి భారీగా నగదు ముట్టినట్టు విచారణలో తేలింది. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా కూడా ఇందుకు అనుగుణంగా సదరు అభ్యర్థికి సహకరించారు. వీరంతా ఎన్నికల ఫలితాల తర్వాత బాధపడినట్టు కూడా సమాచారం. ఇక జిల్లాల్లో కొన్ని మినహా మెజార్టీ స్టేషన్లలో ఈ మేరకు వసూళ్ల పర్వం నడిచినట్టు తేలింది. ఈ నివేదికను ఉన్నతాధికారులకు జిల్లా పోలీసు యంత్రాంగం రహస్యంగా అంజేసింది. ఇందుకు అనుగుణంగా సదరు అధికారులపై చర్యలుండే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అక్కడే అత్యధికం...! 
వాస్తవానికి ఎన్నికలు అంటేనే కోట్ల రూపాయలు డబ్బు వరదలా పారే పరిస్థితి నడుస్తోంది. అందులోనూ అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డంగా దోచుకున్న కోట్ల డబ్బును ఖర్చు చేసి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో  భాగంగా ఓటర్లతో పాటు పోలీసులకు కూడా భారీగా డబ్బును వెదజల్లారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఏయే డీఎస్సీ, సీఐ, ఎస్‌ఐలు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఇంటలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు.

ఇందులో ఆశ్చర్యకరంగా బనగానపల్లె నియోజకవర్గంలోని పోలీసు అధికారులు ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్‌ రెడ్డి నుంచి ఏకంగా రూ.కోటి మేర మామూళ్లు తీసుకున్నట్టు తేలింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల్లో కూడా విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ముగ్గురు డీఎస్పీలు మినహా మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడంతో పాటు తమ విధులను నిర్లక్ష్యం చేశారన్న నివేదికలు కూడా పోలీసు ఉన్నతాధికారులు చేరాయి. మొత్తం మీద ఎన్నికల ఫలితాల కంటే ఇప్పుడు ఈ వసూళ్ల ఫలితాలే పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు.    

మరిన్ని వార్తలు