మావారి ఆచూకీ తెలపండి

22 Jun, 2019 11:21 IST|Sakshi
ఐటీడీఏ ఆవరణలో ఇంజరి గిరిజనులు

సబ్‌కలెక్టర్, డీఎస్పీలను కలిసిన  ఇంజరి గిరిజనులు     

పోలీసులు అన్యాయంగా తీసుకువెళ్లారని ఆవేదన

పాడేరు(విశాఖ పట్టణం)  : పిల్లలను పాఠశాలకు పంపేందుకు వచ్చిన తమ వారిని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, వెంటనే వారి ఆచూకీ తెలపాలని పెదబయలు మండలం మారుమూల ఇంజరి గ్రామానికి చెందిన గిరిజనులు వరద రామ్మూర్తి, పోత్రంగి కనకాలమ్మ, తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు సబ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్, డీఎస్పీ రాజ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పెదబయలు మండలం మారుమూల ఇంజరి గ్రామానికి చెందిన వరద వెంకటేష్‌ అనే గిరిజనుడు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాడేరులో ఉంటూ పిల్లలను చదివించుకుంటున్నాడన్నారు.

గ్రామానికి చెందిన మరో గిరిజనుడు పాత్రోంగి కోటిబాబు కూడా పిల్లలను పాడేరులోని ఓ పాఠశాలలో పిల్లలను చదివిస్తున్నాడన్నారు. వీరిరువురు ఈ నెల 18న తమ కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలను పాఠశాలలకు పంపేందుకు పాడేరు వచ్చారన్నారు.సినిమాహాల్‌ సెంటర్‌లో ఉండగా పోలీసులు వచ్చి తమ వారిని అన్యాయంగా వారి వెంట తీసుకుపోయారన్నారు. తీసుకువెళ్లేముందు ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చారన్నారు. కానీ నేటికి వారి ఆచూకీ తెలపలేదన్నారు. ఎక్కడ దాచిపెట్టారో, వారిని ఏం చేస్తున్నారో భయంగా ఉందన్నారు. తమ వారికి మావోయిస్టులతో కానీ వారి కార్యకలపాలతో కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. మాపై గిట్టని వారు తమవారి పట్ల పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చునన్నారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలని లేని పక్షంలో బేషరతుగా విడుదల చేయాలని వారు కోరారు.

>
మరిన్ని వార్తలు