రౌడీషీటర్లకు కొమ్ముకాసే ఖాకీలపై వేటు

3 Oct, 2019 09:41 IST|Sakshi
జిల్లా పోలీస్‌ కార్యాలయం 

సాక్షి, గుంటూరు : క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన కొందరు కానిస్టేబుళ్లు శాంతిభద్రతలకు విఘాతం కల్పించే రౌడీషీటర్లకు కొమ్ము కాస్తున్నారు. ఎప్పటికప్పుడు వారికి పోలీస్‌స్టేషన్లలోని అధికారులు తీసుకునే చర్యలు గురించి ముందస్తు సమాచారం అందజేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ కారణంగా సమస్యాత్మకమైన రౌడీషీటర్లు అజ్ఞాతంగా ఉంటూ హత్యలకు వ్యూహాలు రచిస్తూ, వైట్‌ కాలర్‌ నేరాలకు సైతం పాల్పడుతున్నారు. సివిల్‌ వివాదాల్లో తలదూర్చి బెదిరింపులకు పాల్పడుతూ దందాలు చేస్తున్నారు. ఇటీవల ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారంతో అర్బన్‌ జిల్లా పరిధిలో నలుగురు రౌడీషీటర్లతో పాటు మరో ఆరుగురు యువకులను అరెస్టు చేయడంతో వరుసగా ఏడు హత్యలకు వ్యూహం రచించినట్లు పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. రౌడీషీటర్ల హత్యల విషయం బయట పడటంతో నగరవాసులు, మిగిలిన రౌడీషీటర్లు ఉలికిపాటుకు గురయ్యారు. మరింత అప్రమత్తమైన పోలీసులు మరో ముఠాలోని రౌడీషీటర్లను అదుపులోకి తీసుకొని విచారించే పనిలో పడ్డారు.  

సిబ్బంది పనితీరుపై సమీక్ష 
సొంత ఇంటికే కన్నం వేస్తూ సమాచారాన్ని రౌడీషీటర్లకు చేరవేస్తున్న సిబ్బందిని గుర్తించే పనిలో అర్బన్, రూరల్‌ ఎస్పీలు నిమగ్నమయ్యారు. సమాచారాన్ని రహస్యంగా ఉంచుతూ కౌన్సెలింగ్‌ సమయంలో రౌడీషీటర్లు విధిగా పోలీస్‌ స్టేషన్లలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన కొందరు కానిస్టేబుళ్లు  ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఎస్పీలు సీరియస్‌గా పరిగణించారు. సమాచారం చేరవేస్తున్న సిబ్బంది గురించి నిఘా వర్గాల ద్వారా ఆరా తీస్తున్నారు. రౌడీషీటర్లకు సిబ్బంది సమాచారం చేరవేస్తూ వారి నుంచి వేల రూపాయలు అందుకుంటున్నట్లు తెలిసింది. నిఘా వర్గాలు కూడా  ఈ విషయాల గురించి ఉన్నతాధికారులకు నివేదికలు అందచేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు రౌడీషీటర్లు ఎక్కడ ఉన్నరన్న సమాచారం కూడా ప్రస్తుతం స్థానిక పోలీస్‌ స్టేషన్లలో ఎలాంటి సమాచారం లేకపోవడం అందుకు నిదర్శనం. అజ్ఞాతంలో ఉన్న రౌడీషీటర్ల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. వారిని అదుపులోకి తీసుకుంటునే  వ్యూహ రచనలు బయట పడే అవకాశం ఉంది. రాజధాని జిల్లాలో రౌడీమూకలు పాత కక్షలు, ఆధిపత్య పోరు కోసం ఎవరికి వారు హత్యలు చేసుకునేందుకు పథకాలు వేస్తున్నట్లు తేలడంతో వారి కదలికలపై పోలీస్‌ యంత్రాంగం మరింతగా నిఘా పెంచింది. 

చర్యలకు రంగం సిద్ధం 
ఈ క్రమంలో విధి నిర్వహణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్‌బాస్‌లు రంగం సిద్ధం చేస్తున్నారు. విచారణలో వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే వారిపై క్రిమినల్‌ కేసులు కూడా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్‌ వర్గాల్లో అంతర్గంతంగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే మరోసారి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.

మరిన్ని వార్తలు