పదోన్నతుల కోసం పోలీసుల నిరీక్షణ

17 Oct, 2013 03:32 IST|Sakshi

రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితితో తీవ్ర జాప్యం
ప్రతిపాదనలను పట్టించుకోని ప్రభుత్వం!

 
 సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ లో ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు పదోన్నతుల కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారు. పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి పంపినా ఆయన ఫైళ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన డీజీపీ ప్రసాదరావు అయినా తమ పదోన్నతులపై స్పందిస్తారని వారు ఆశిస్తున్నారు. 1989 బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు.. ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తుండగా వారికి డీఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. ఈ బ్యాచ్‌కి చెందిన కొంతమందికి ఇప్పటికే పదోన్నతి లభించగా.. మరో వంద మందికి డీఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ప్రభుత్వం స్పందించకపోవడంతో పదోన్నతుల సమస్య పరిష్కారం కావడం లేద ని  వారు వాపోతున్నారు.
 
 సీనియారిటీ లిస్టు తయారీలో జాప్యం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తిందనే వాదన ఉంది. సీనియారిటీ జాబితాలో ఇబ్బందులను తొలగించేందుకు ఐచ్చిక జాబితాను తయారు చేయాలని హైకోర్టు 2009లో పోలీసు శాఖను ఆదేశించింది. ఒకే బ్యాచ్ వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేంజ్‌లలో ఒకేసారి పదోన్నతి కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. అయినప్పటికీ ఐచ్చిక సినియారిటీ జాబితా తయారుచేయకుండానే ఈ ఏడాది వరకూ పదోన్నతులు కల్పించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది మార్చిలో ఐచ్ఛిక సినియారిటీ జాబితాను తయారుచేసి ప్రభుత్వానికి అందించారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తేనే ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సుమారు 40 డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరితోపాటు, అన్ని విభాగాలలో సుమారు 45 అదనపు ఎస్పీ పోస్టులు, మరో 30 నాన్ కేడర్ ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు