ఏపీలో పోలీసుల పనితీరు భేష్‌

30 Dec, 2017 14:24 IST|Sakshi

విలేకరుల సమావేశంలో డీజీపీ సాంబశివరావు 

సాక్షి, అమరావతి: శాంతిభద్రతల విషయంలో 2017లో రాష్ట్ర పోలీసులు ఎక్కడా ఫెయిల్ కాలేదని, పోలీసుల పనితీరు సంతృప్తిగా ఉందని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ఎర్రచందనం విషయంలో అధికారులు చక్కగా పనిచేస్తున్నారంటూ ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, స్మగ్లర్లను పట్టుకోవడంలో మంచి పురోగతి సాధించామని విలేకరుల సమావేశంలో తెలిపారు. సైబర్ నేరాలు 46 శాతం పెరిగాయన్నారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఎ, బి, సి, డి కేటగిరీలో అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. రహదారి ప్రమాదాలను 5 శాతం తగ్గించామన్నారు.

రూ.68 కోట్లను చలానా రూపంలో వసూలు చేశామని, గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు 20 టీమ్‌లను ఏర్పాటు చేశామని, నక్సల్స్‌ను నియంత్రించడంలో విజయం సాధించామని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి నక్సల్స్ సమస్యను ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. కోడి పందేల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్స్ పిన్స్ యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్‌ వల్ల పోలీసులు సీజ్ చేసిన వాహనం ఏ పోలీస్ స్టేషన్లో ఉందో తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన వాహనాల విషయంలో ఇది ఎంతో ఉపయోగకరమని సాంబశివరావు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు ఎంజాయ్ చేయొచ్చని, అయితే మత్తు పానీయాలు తాగని వారితోనే వాహనం నడిపించాలని సూచించారు.

మరిన్ని వార్తలు