పోలింగ్‌ ఏజెంటే ‘కీ’లకం  

11 Apr, 2019 10:10 IST|Sakshi

సాక్షి, సత్తెనపల్లి : ఎన్నికల ప్రచారం ముగిసింది. బలాబలాల బేరీజులో అభ్యర్థులు మునిగిపోయారు. ప్రస్తుతం పోలింగ్‌ ప్రారంభం అవుతుంది. ఎన్నికల యుద్ధానికి సర్వం సన్నద్ధమైంది. ఈ తరుణంలో పోలింగ్‌ కేంద్రంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఏజెంటు పాత్ర ఎంతో ప్రధానమైనది. ఏ మాత్రం తేడా వచ్చినా అభ్యర్థుల భవితవ్యమే తారుమారవుతుంది. ఎన్నికల సమయంలో పోలింగ్‌ కేంద్రాలు అన్నింటినీ అభ్యర్థి ఒక్కరే పర్యవేక్షించడం సాధ్యం కాదు.

కాబట్టి ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఆయన తరుఫున ఒక ఏజెంటును నియమించుకుంటారు. ఈ ఏజెంటు ప్రత్యర్థి పార్టీకి తలొగ్గి, లోపాయికారీ ఒప్పందం చేసుకున్నా.. అసమర్థుడైన వ్యక్తి అయితే ఇక అంతే సంగతులు.పోలింగ్‌ కేంద్రంలోని ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లను తమ అదుపులో ఉంచుకోగలిగితే అభ్యర్థుల పంట పండినట్లే. కేంద్రంలోకి వచ్చే ఓటరు గురించి సిబ్బందికి తెలియకపోవడంతో నిర్ధారణకు పోలింగ్‌ ఏజెంటు కీలకంగా వ్యవహరిస్తాడు. ఏజెంట్ల నియామకం, బాధ్యతలు, నిబంధనలను ఒక సారి పరిశీలిస్తే... 

  • అదే పోలింగ్‌ బూత్‌లో ఏజెంటు ఓటరుగా ఉండాలి. లేదంటే అదే నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నా అనుమతిస్తారు. 
  •  పోలింగ్‌ ఏజెంటుగా ఉండాల్సిన వ్యక్తికి తప్పనిసరిగా ఓటరు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉండాలి.
  •  ప్రతి పోలింగ్‌ ఏజెంటు తాము ఏ పార్టీ అభ్యర్థి తరుఫున పోలింగ్‌ కేంద్రంలో ఉంటున్నాడో ఫారం–బి ని ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారికి అందజేయాలి. 
  • ఏజెంటు తమ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉన్నారా, లేదో నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారిని పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు. 
  • ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి గంట సమయం ముందుగానే ఏజెంటు పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలి. 
  • ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి పోలింగ్‌ కేంద్రానికి ఒక ఏజెంటు, ఇద్దరు ప్రత్యామ్నాయ ఏజెంట్లను నియమించుకోవచ్చు. 
  • ఓటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు ఆయన పోలింగ్‌ కేంద్రంలోనే ఉండాలి. 
  • పోలింగ్‌ కేంద్రంలోనికి సెల్‌ఫోన్లు, కార్డ్‌లెస్‌ ఫోన్లు , వైర్‌లెస్‌ సెట్లు తీసుకోని రాకూడదు. 
  • ఓటు వేసిన, వేయని వారి క్రమ సంఖ్యలు, పేర్లను కాగితంపై రాసి బయటకు పంపకూడదు. 
  • ఓటరు జాబితాను పోలింగ్‌ స్టేషన్‌ బయటకు తీసుకొని వెళ్లకూడదు. 
  • అత్యవసర పరిస్థితుల్లో పోలింగ్‌ ఏజెంటు కేంద్రాన్ని విడిచి వెళ్లాల్సి వస్తే ఆ పార్టీకి చెందిన ప్రత్యామ్నాయ ఏజెంటు సిద్ధంగా ఉన్న తర్వాత మాత్రమే వెళ్లాలి.
  •  పోలింగ్‌ ఏజెంటు కేంద్రంలోకి వచ్చే సమయం, వేళ్లే సమయాన్ని ప్రత్యేక పుస్తకంలో నమోదు చేయాలి. 
  • ఏజెంటుకు ఫొటో గుర్తింపు కార్డు లేకపోతే పోటీ చేస్తున్న అభ్యర్థి లిఖిత పూర్వకంగా దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. 
  • ఎన్నికల నిర్వహణలోని సిబ్బందికి ఏజెంట్లు సహకరించాలి. సిబ్బందిని ప్రలోభాలకు గురి చేయకూడదు. 
  • పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లు ముఖాలు కనిపించెలా కూర్చోవాలి. జాతీయ, ప్రాంతీయ, పార్టీల తర్వాత స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు వరుస కమ్రమంలో కూర్చోవాలి.  
మరిన్ని వార్తలు