రాజకీయ లబ్ధికోసమే రాష్ట్ర విభజన

6 Sep, 2013 06:29 IST|Sakshi

పీలేరు, న్యూస్‌లైన్: రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని సాప్స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలసుబ్రమణ్యం, ఎన్. రాజారెడ్డి అన్నారు. గురువారం పీలేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మందితో సమైక్య విద్యార్థి సింహగర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ఓట్లు, సీట్ల ప్రాతిపదికన రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సివస్తే దేశంలో ఇంకా అనేక కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు. వేర్పాటువాదుల రాజకీయ లబ్ధికోసం సీడబ్ల్యూసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ఒప్పుకునేది లేదన్నారు.

హైదరాబాద్ మహానగరం కేసీఆర్ అబ్బసొత్తుకాదని, 23 జిల్లాల ప్రజలు ఉమ్మడి ఆస్తిఅని వారు పేర్కొన్నారు. సీమాంధ్ర ఉద్యమం 13 జిల్లాలు, 16 యూనివర్సిటీల నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రజల మధ్యనుంచి పుట్టుకొచ్చిందన్నారు. విభజన జరిగితే మనబిడ్డల భవిష్యత్ అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం విడిపోతే నీటి కోసం తెలంగాణతో యుద్ధాలు చేయాల్సి వస్తుందని చెప్పారు. వ్యవసాయ రంగం పూర్తిగా ఛిన్నాభిన్నమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఆంధ్రులు లేని అంటోనీ కమిటీని మనం సమర్థించాలా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ వార్‌రూంలో తలలూపి బయట ఏదో ఉద్ధరిస్తామని మన నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. గ్రామాలకు వచ్చే ప్రజాప్రతినిధులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అన్ని విభాగాలలో 80 శాతం సీట్లున్న హైదరాబాద్ విద్యార్థులకు ఆయువుపట్టని చెప్పారు. పీలేరు ప్రైవేట్ కళాశాలల ప్రతినిధి జ్ఞానశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విభజనకు ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు ఎస్. చక్రధర్, కేవీ. కిషోర్‌కుమార్, ఎన్. పురుషోత్తం, ఎంఈవో ఏటీ. రమణారెడ్డి, ప్రైవేట్ కళాశాలల అధినేతలు బాలసుబ్రమణ్యం, సురేంద్రరెడ్డి, డీవీ. రమణారెడ్డి, సంజీవరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, అశోక్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, విశ్వనాథరెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు