రాజకీయ ఊసరవెల్లి..

24 May, 2018 15:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నాడు వైఎస్సార్‌సీపీని స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించాయని ఆయన ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు అభినందించటమే అందుకు నిదర్శనమన్నారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు తనపై ఉన్న కేసుల విషయంలో మాత్రం కాంగ్రెస్ నాయకుల కాళ్లు పట్టుకుని స్టేలు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. 

మైలవరం పట్టణంలో గురువారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ‘వైఎస్‌ జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ చంద్రబాబే ముఖ్య కారణం. పైకి తేనె పూతలాగా ఉంటూ, లోపల మాత్రం తేనె పూసిన కత్తిలా ఏపీ సీఎం ఉంటాడు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అప్పుడు చంద్రబాబే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా కాపాడారు. కాంగ్రెస్ పార్టీ మా ప్రథమ శత్రువు అని చెప్పుకునే చంద్రబాబు నిన్న కర్ణాటకలో చేసిందేమిటి. చంద్రబాబు ఎప్పుడూ చెప్పేదొకటి, చేసేది మరొకటి.ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్‌ పార్టీ పెడితే, పార్టీ సిద్దాంతాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. చంద్రబాబు నయవంచకుడని ఎన్టీఆర్‌ అప్పుడే చెప్పారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబే నాయకుడు. 

నేడు వైఎస్‌ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి చంద్రబాబుకు పిచ్చెక్కుతోంది. వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. జననేత జగన్‌ నిఖార్సయిన వ్యక్తి, విలువలతో కూడిన పోరాటం చేసే వ్యక్తి అని’  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ నేతలు వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, జోగి రమేష్, మెండితోక జగన్మోహన్‌రావు, పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు