బాబోయ్‌.. ఆయన చేత రిబ్బన్‌ కటింగా?

16 Apr, 2017 08:38 IST|Sakshi
బాబోయ్‌.. ఆయన చేత రిబ్బన్‌ కటింగా?

గాసిప్‌

‘ఏం తమషాగా ఉందా? నా నియోజకవర్గ పరిధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తూ నన్నే విస్మరిస్తారా? వ్యాపారం చేసుకోవాలని లేదా? నేను ప్రారంభోత్సవం చేయాలంటే చెప్పినట్లు చేయాల్సిందే? లేదంటే మీకే ఇబ్బందులు..’ పది రోజుల కిందట కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యాపారులను బెదిరించిన తీరు ఇది.

విజయవాడకు పక్కనే ఉన్న నియోజకవర్గానికి చెందిన గొల్లపూడిలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. ‘ఫార్మా’ పేరిట కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సోమవారం (ఏప్రిల్‌ 17న) ఆర్భాటంగా ప్రారంభించనున్నారు. అయితే ప్రారంభోత్సవానికి రావాలని కాంప్లెక్స్‌ యాజమాన్యం సదరు మంత్రిని ఆహ్వానించగా.. ఆయన వారిపై ఆగ్రహించి కోర్కెల చిట్టా విప్పారట. కాంప్లెక్స్‌లో ఓ షాపును నజరానాగా ఇవ్వాలని హుకుం జారీ చేశారట. ఆయన కోరిక మరీ ఖరీదైనది కావడంతో వారు విస్తుపోయారు. అయినా.. ఆయన కోరినట్టే మార్కెట్‌ విలువ ప్రకారం రూ.40 లక్షలు చేసే షాపును నామ మాత్రపు ధరకే అప్పగించినట్లు తెలిసింది. ఆ సొమ్ము కూడా మంత్రి ఇతరుల నుంచే ఇప్పించినట్లు సమాచారం.

మంత్రి ఏ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వెళ్లినా.. ఏదో ఒక రూపంలో నజరానాలు అందుకున్నట్లుగా వ్యాపారవర్గాల్లో గుసగుస. మంత్రి ప్రారంభోత్సవం చేసి వెళ్లాక.. ఆయన సతీమణి వచ్చి.. అక్కడ తనకు కావాల్సినవి పట్టుకెళ్తారట! ఇందుకు ఎలాంటి బిల్లు చెల్లింపులూ ఉండవు. మంత్రి, కుటుంబసభ్యుల వ్యవహారంతో విసుగెత్తిపోయిన వ్యాపారులు.. అయన చేత రిబ్బన్‌ కట్టింగ్‌ అంటేనే.. వద్దు బాబోయ్‌ అని బెంబేలెత్తిపోతున్నారు.

మరిన్ని వార్తలు