ఒకే ఒరలో రెండు కత్తులు

12 Mar, 2019 08:29 IST|Sakshi
ఒకే కారులో అమరావతి బయలుదేరి వెళ్తున్న పీతల సుజాత, ఘంటా మురళీ రామకృష్ణ

సాక్షి,పశ్చిమ గోదావరి : రాజకీయాలలో బద్ధశత్రువులు, మిత్రులు ఉండరంటారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిన్నటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ఒకే కారులో రాజధాని అమరావతికి పయనమయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇప్పటికి పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు, శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ఒక్కమారు కూడా సమయానికి రాని ఎమ్మెల్యే పీతల సుజాత వట్లూరు గేటు వద్ద తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళికి స్వాగతం పలకడానికి ముందే సిద్ధంగా ఉండటంతో ఆ  పార్టీ నేతలే అవ్వాక్కయారంట. ప్రస్తుతం వారిద్దరూ ఒకే కారులో ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా  పీతల వర్గీయులందరినీ ఈ కార్యక్రమానికి సమాయత్తం చేయడంతోపాటు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి 40 కార్లలో ఆమె అనుచరులు హాజరవడం చర్చనీయాంశమైంది.


అంతా పాత నీరే కొత్త నీరు స్వల్పం
చింతలపూడి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ సోమవారం అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కామవరపుకోట మండలం నుంచి వెళ్ళిన వారందరూ అధిక శాతం ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్న నాయకులు, కార్యకర్తలే. వెళ్లిన వారిలో కొత్తగా మురళీ అనుచరగణంగా చెప్పుకునే స్థాయికల నాయకులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎమ్మెల్యే సుజాత వర్గీయులుగా ఉన్న కామవరపుకోట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల ఎంపీపీలతో పాటు వారి అనుచరగణం మొత్తాన్ని ఈ సమావేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. 


ఎన్నికల నియమావళి ఉందా? లేదా?        
చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కామవరపుకోట ఆర్‌అండ్‌బీ బంగ్లా దగ్గర నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులతో సుమారు 100 కార్లలో ర్యాలీగా అమరావతికి తరలివెళ్లారు. వీటిలో 30 నుంచి 40 కార్ల వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన జెండాలతో ర్యాలీగా వెళ్ళాయి. ప్రతీ కారుకూ ఓ స్టిక్కరు ఉంది. ఎన్నికల నియమావళి నేపథ్యంలో జెండాలు, స్టిక్కర్లు, ర్యాలీకి ఎటువంటి అనుమతి తీసుకోలేదని స్థానిక తహసీల్దార్‌ శ్రీ పల్లవి, ఎంపిడీఓ జె మన్మథరావు తెలిపారు. తాము  ఏలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న ఎన్నికల సమావేశానికి వెళ్లినట్టు వివరించారు.

మరిన్ని వార్తలు