ఫ్లెక్సీలు కళకళ.. కోడ్‌ వెలవెల!

13 Mar, 2019 15:29 IST|Sakshi
జెడ్పీటీసీ వాసిరెడ్డి ప్రసాద్‌ ఇంటిముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, తోటరావులపాడు గ్రామంలోని ఆర్చికి అమర్చిన టీడీపీ నేతల ఫొటోలు  

సాక్షి, కోనాయపాలెం (చందర్లపాడు) : ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 11న ఎలక్షన్స్‌ జరగనున్నాయి. అయినప్పటికీ కోనాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్‌ ఇంటి ముందు పింఛన్లు, సంక్రాంతి కానుకలతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. హరిజనవాడలోని వాటర్‌ ట్యాంకు వద్ద, అంగన్‌వాడీ కేంద్రం వద్ద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల వివరాల జాబితాను రాశారు.

ఎలిమెంటరీ పాఠశాల (చిన్నైస్కూల్‌) వద్ద చంద్రబాబు, లోకేష్‌ బొమ్మలతో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రచార పట్టికలు దర్శనమిస్తున్నాయి. ఇవి  గ్రామంలోని జనసమర్థం ఉండే ప్రధాన రహదారుల వెంబడి ఉన్నప్పటికీ అధికారులు వీటిని తొలగించలేదు. ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని తొలగించని పక్షంలో సంబంధిత అధికారులపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. మరి వీటిని తొలగిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది.

 
తోటరావులపాడులో ఇలా.. 
తోటరావులపాడు గ్రామ ఎంట్రన్స్‌లో హైస్కూల్‌కు వెళ్లే ప్రధాన మార్గానికి ఎన్టీర్‌ మార్గ్‌ పేరు పెట్టి పెద్ద ఆర్చిని నిర్మించారు. ఈ ఆర్చికి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు.

ఈ ఫొటోల డూమ్‌లలో లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. ఏటూరు గ్రామానికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి వెంబడే ఈ ఆర్చి ఉండటం విశేషం. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటికీ అధికారులు ఈ ఆర్చికి అమర్చిన టీడీపీ నాయకుల ఫొటోలు కనపడకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. 

మరిన్ని వార్తలు