దొనకొండలో అనకొండలు

3 Dec, 2014 01:20 IST|Sakshi

ఆక్రమణలిలా..

చందలూరు గ్రామ పంచాయతీ పరిధిలో పలకల ఫ్యాక్టరీ నుంచి కొండ క్యారీలకు వెళ్లే దారిలో సుమారు 100 ఎకరాల భూమి అన్యాక్రాంతైమైంది. రాత్రికి రాత్రే ఫెన్సింగ్ రాళ్లు పాతి భూమిని ఆక్రమించారు. పొలాలకు ఉన్న నీటి కుంటలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో అదే గ్రామ పంచాయతీ పరిధిలో బందిళ్లపాయి కొండ దగ్గర సుమారు వంద ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ భూమిని లక్షలాది రూపాయలకు కబ్జాదారులు ఇతరులకు విక్రయించారు.
 
దర్శి పట్టణ నడిబొడ్డులోనే 246, 247, 248 సర్వే నంబర్లలో సుమారు పది ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ఈ భూమి టీడీపీ ముఖ్యనేత కబంద హస్తాల్లో ఉండటంతో అధికారులు చ ర్యలు తీసుకోలేకపోతున్నారు. లంకోజనపల్లి గ్రామ పంచాయతీలో 80 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామ టీడీపీ నాయకులు  కబ్జా చేశారు. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచి జిల్లా అధికారులతోపాటు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ భూమిని  మాత్రం కబ్జాదారుల చేతుల నుంచి కాపాడడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది.
 
చెక్ డ్యామ్‌నూ ఈ అనకొండలు వదల్లేదు. గతంలో నిర్మించిన ఈ చెక్ డ్యామ్ నీటి నిల్వలతో చుట్టు పక్కల 50 ఎకరాలకు నీరందించేది. వందలాది మంది రైతుల పంటలు పండించుకునే వారు. ప్రస్తుతం అదికాస్తా ఆక్రమణలకు గురవడంతో ఈ ప్రాంత రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునేదెవరు? దీంతో ఆ ప్రాంతంలోని రైతులు వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
 
దొనకొండ మండలంలోని పోలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 54 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. నకిలీ రికార్డులు సృష్టించి ఈ భూములను దర్శి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కబ్జాదారులు రిజిస్టర్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గొప్పగా ప్రకటించిన మంత్రి కళ్ల ముందే ఆక్రమణలు సాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని  జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 
అయితే ఆర్‌ఐని పంపిస్తా:  తహశీల్దారు మస్తాన్

ఈ విషయమై డిప్యూటీ తహ శీల్దార్  మస్తాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆక్రమణలు జరుగుతున్నాయా...వెంటనే ఆర్‌ఐను పంపి  అక్కడ ప్రభుత్వ భూములు పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు. నాలుగు నెలలుగా ఈ తంతు సాగుతున్నా పట్టించుకోకుండా సాక్షి ప్రశ్నించగానే ఇప్పుడే తెలిసినట్టు ... ఆర్‌ఐని పంపించి పరిశీలిస్తాననడం గమనార్హం.   
 
దర్శి : రాష్ట్ర ప్రభుత్వం దొనకొండను పారిశ్రామిక హబ్‌గా ప్రకటించడంతో దర్శి నియోజకవర్గంలోని భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొందరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా  రెవెన్యూ యంత్రాంగం నోరుమెదపకపోవడం పట్ల విమర్శలకు తావి స్తోంది. దర్శి నియోజకవర్గ పరిధిలో దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలున్నాయి. వీటి పరిధిలో  విలువైన ప్రభుత్వ భూములు పరిశ్రమల స్థాపనకు అనువు గా ఉండడంతో ప్రభుత్వం ఈ ప్రాంతం పై దృష్టిసారించింది.

దొనకొండను ఇండస్ట్రియల్ హబ్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో అక్రమార్కుల కన్ను ఈ భూములపై పడింది. మంత్రి నియోజకవర్గం కావడంతో ఆయన పేరు చెప్పుకుంటూ ... అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. పొక్లెయిన్ల సాయంతో రాత్రికి రాత్రే చదును చేయడమే కాకుండా ఫెన్సింగ్ రాళ్లు పాతి మరీ ఆక్రమిస్తున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా