‘పశ్చిమ’ ప్రస్థానం

12 Mar, 2019 12:34 IST|Sakshi
పశ్చిమ కూడలి ఎన్‌ఏడీ 

పునర్విభజన కాకముందు మహామహులు అసెంబ్లీకి

గుడివాడ గురునాథరావుకు  మంత్రి యోగం

పారిశ్రామికంగా ఆయవుపట్టు 

ఎన్నికల సంబరం మొదలైంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తోంది. రాజకీయంగా పశ్చిమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలోని ప్రముఖ నాయకులు ఇక్కడ నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. పారిశ్రామికంగా ఈ నియోజకవర్గం నగరానికి ఆయువుపట్టు. ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలు ప్రజలను నియోజకవర్గం కలిగి ఉంది. ప్రస్తుత ఎన్నికల వేళ పశ్చిమ ముఖచిత్రాన్ని ఓసారి పరిశీలిద్దాం. 

సాక్షి, గోపాలపట్నం: విశాఖ పశ్చిమ నియోజకవర్గం.. హిందుస్ధాన్‌ షిప్‌యార్డు, హెచ్‌పీసీఎల్, కోరమాండల్‌ తదితర పరిశ్రమల పుట్టినిల్లు. పెద్ద సంఖ్యలో వలస ప్రజలకు బతుకుపెడుతున్న గడ్డ ఇది. ఒకప్పటి పెందుర్తి నియోజకవర్గం, రెండో నియోజకవర్గంలో మహామహులు ఏలిన ప్రాంతం ఇది. ఎందర్నో చట్టసభలకు పంపిన రాజకీయ కేంద్రం పశ్చిమ. ఇంత వరకూ ఒకరికి మంత్రి యోగం కల్పించగా, ఇద్దరు మహిళామణులకు ఎమ్మెల్యే ఛాన్స్‌ ఇచ్చిన ప్రాంతం ఇది. 

నేతల పరంపర

విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఏర్పాటు కాక పూర్వం అటు పెందుర్తి నియోజకవర్గంలోనూ, ఇటు రెండో నియోజకవర్గం నుంచి మహాహహులేలారు. బాజీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం నుంచి కంచరపాలెం, జ్ఞానాపురం, అటు మాధవధార, దొండపర్తి, చినవాల్తేరు, పెదవాల్తేరు,  ఎంవీపీ కాలనీ వరకూ రెండో నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా వాసుదేవరావు (టీడీపీ), రాజాన రమణి (టీడీపీ), పల్లా సింహాచలం (టీడీపీ), పిన్నింటి వరలక్ష్మి (టీడీపీ), సూరెడ్డి (కాంగ్రెస్‌), రంగరాజు (కాంగ్రెస్‌) పని చేశారు.

ఇంకోవైపు బాజీజంక్షన్‌ నుంచి గోపాలపట్నం, పెందుర్తి మండలం, అటు సింహాచలం, ఆరిలోవ, మధురవాడ వరకూ పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉండేవి. పెందుర్తి నియోజకవర్గం అప్పటి తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద నియోజకవర్గాల్లో రెండో స్ధానంలో ఉండేది.

ఇక్కడ ఎమ్మెల్యేలుగా గుడివాడ అప్పన్న (కాంగ్రెస్‌), పెతకంశెట్టి అప్పలనరసింహం (టీడీపీ), ఆళ్ల రామచంద్రరావు(టీడీపీ), గుడివాడ గురునాథరావు(కాంగ్రెస్‌), మానం ఆంజనేయులు (సీపీఐ), గణబాబు(టీడీపీ), తిప్పలగురుమూర్తిరెడ్డి (కాంగ్రెస్‌) పని చేశారు. అసెంబ్లీలో అడుగుపెట్టాక ఇంత మందిలో ఒకరికే మంత్రి యోగం వరించింది. గుడివాడ గురునాథరావు సాంకేతిక విద్యాశాఖమంత్రిగా పని చేశారు. తర్వాత నుంచి ఎవరికీ ఆయోగం రాలేదు.

ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు 2,11,372
పురుష ఓటర్లు 1,09,899
మహిళా ఓటర్లు 1,01,469
పోలింగ్‌ బూత్‌లు 237
వార్డులు 13

ఇద్దరు మహిళలకు ఛాన్స్‌

పునర్విభజనకు ముందు రెండో నియోజకవర్గ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి చట్టసభలో కూర్చునే ఛాన్స్‌ వరించింది. తొలిసారిగా టీడీపీ ఎమ్మెల్యేగా రాజాన రమణికి, తర్వాత కాలంలో పిన్నింటి వరలక్ష్మికి ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం పొందారు. టీడీపీ ఎమ్మెల్యే గణబాబుకి రెండుమార్లు ఎమ్మెల్యేగా చేసే అవకాశం ఈ ప్రాంతం నుంచే వచ్చింది. ఒకప్పుడు పెందుర్తి ఎమ్మెల్యేగా, తర్వాత పశ్చిమ ఎమ్మెల్యేగా పని చేసే ఛాన్స్‌ పొందారు. 

పునర్విభజన తర్వాత.. 

పశ్చిమ నియోజకవర్గం పుట్టి పదేళ్లయింది. అంతకు ముందు ఈప్రాంతం పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉండేది. 2009లో తొలిఎన్నిక జరిగింది. తర్వాత 2014లో ఎన్నిక జరిగింది. తాజాగా 2019 ఎన్నికలకు సిద్ధం అయింది.. ఈ నియోజకవర్గం బీసీ రిజర్వేషన్‌గా ఉంది. ఒక సారి 2009లో తాజా ఎమ్మెల్యే గణబాబు అప్పట్లో పీఆర్‌పీ అభ్యర్థిగా (40,874 ఓట్లు వచ్చాయి).

కాంగ్రెస్‌ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌ (45,018 ఓట్లతో ) గెలుపొందారు. తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థిగా గణబాబు 76,791 ఓట్లు సాధించారు. తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయప్రసాద్‌ (తాజా వైస్సార్‌ సీపీ) గెలుపొందగా ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు అధికారంలో ఉన్నారు. ఇప్పటికి వరకూ అత్యధిక మెజారిటీ గణబాబే సాధించారు. 

వార్డుల వారీగా..

పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌లు 237 ఉన్నాయి. కంచరపాలెం, గోపాలపట్నం, మల్కాపురంలు  సమస్యాత్మక ప్రాంతాలు మారాయి. గోపాలపట్నం, ములగాడ మండలాలు. అందులో వార్డులు 36,40, 41 నుంచి 49 వార్డులు, 66 నుంచి 68వార్డులు నెలకొన్ని ఉన్నాయి. 

వలస జీవుల ఆవాసం

పూర్వం కులాల వారిగా ఊళ్లు ఉండేవి. ఇప్పుడు వలసలు పెరిగిపోయాయి. స్థానికులతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనం ఇక్కడ బతుకుదెరువు కోసం వచ్చి నివాసాలు ఉంటున్నారు. ఇక్కడి కొండవాలు మురికివాడల జనం, పారిశ్రామిక వాడలో వలస జనం, కార్మికులు, కూలీలు గెలుపోటములకు ప్రభావితం చూపుతారు. కాపు, గవర, యాదవ, తర్వాత వెలమ, మాల సామాజిక వర్గాల వారు అధికంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు