కోడలా, కోడలా...కొడుకు పెళ్లామా...

10 Apr, 2019 08:50 IST|Sakshi

ఓటరుగా నాదో ప్రశ్న  

ఓ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఆ ఏడాదంతా కష్టపడాలి. అది ఎల్‌కేజీ కానీ...పదో తరగతి పరీక్ష కానీ. ఏ పరీక్ష అయినా ఇదే పద్ధతి. ఆ ఉత్తీర్ణతకు ముందు పలు విభాగాల పాఠ్యపుస్తకాలు అధ్యయనం, ప్రతినెలా, త్రైమాసికం, ఆఫ్‌ ఇయర్లీ, ఫైనల్‌ పరీక్షలు ఉం టాయి. ఒక్కో మెట్టు దాటి ... ఫైనల్‌లో ఉత్తీర్ణులైతేనే సర్టిఫికెట్‌. మరి ఈ నేతలేమిటో ఎన్నికల ముందు సీటు దక్కించుకొని ఓటేయాలని నేరుగా మా ముందుకే వచ్చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తామనే ఆలోచన ఉన్నవారు జనం మధ్యలో ఉండి...కష్ట, నష్టాలపై పోరాడాలి కదా...పోరాటం వద్దు... ఏ సమస్యలున్నాయో తెలుసుకోవాలి కదా. నియోజకవర్గ పరిధులు తెలి యవు, అందులో మండలాలు...మండలాల్లోని గ్రామాల మొహం ఏనాడైనా చూశారా వీరు. రాజమహేంద్రవరం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మాగంటి రూప, నగర టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ విషయం దగ్గరకు వద్దాం. గత నెల వరకు ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో తెలియదు... ఓ నగర నేతైతే ‘ఆ సీటు నాదే...నన్ను కరివేపాకులా వాడుకుంటున్నారని, యూజ్‌ అండ్‌ త్రోగా పార్టీలో నేనున్నానని’ విలేకర్ల సమావేశం పెట్టి మరీ వాపోయాడు.

రాజమహేంద్రవరం రూరల్‌ ప్రజాప్రతినిధి, ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన సీనియర్‌ నేత రాజమహేంద్రవరం నగరం టికెట్‌ కోసం చక్రం తిప్పినా ఆ చక్రం గతి తప్పిం ది. చివరకు వలస నేత మేతకే రుచిమరిగిన అధి ష్టానం అటువైపే మొగ్గు చూపిం ది. ఏకంగా ఆయన కోడలకే ‘జై భవానీ అంటూ ‘జై’ కొట్టింది. ఇక పార్లమెంటు అభ్యర్థి విషయంలో పోటీ లేదు. మామ వద్దంటూనే కోడల్ని ముందుకు నెట్టి సైకిల్‌ ఎక్కించేశారు. అవన్నీ నాకెందుకు...మీ పార్టీ అంతర్గతం. నా దగ్గరకు వచ్చి ... నా ఓటును కెలుకుతున్నారు కాబట్టి నేనో విషయం నేరుగా ఈ మహిళా అభ్యర్థుల్నే అడుగుతా. ఇంతకు ముందు చెప్పినట్టు ఓ విద్యార్థి పరీక్ష గట్టెక్కాలంటే ఆ ఏడాదంతా చదవాలి కదా.

మరి మీరు ఈ నియోజకవర్గం కోసం ఏమి చదివి మా ముందుకు వచ్చారు. నియోజకవర్గంపై మీకు ఏమాత్రం అవగాహన ఉంది? ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం కోసం సుద్దులు చెబుతున్న మీ మామగారి చరితేమిటో మీకు తెలియంది కాదు. ఓ పార్టీ వాళ్లు గెలిపిస్తే...వారికి వెన్నుపోటు పొడిచి మరో పార్టీ కండువా వేసుకొని ఇప్పుడు ఓటుకు రేటు కడుతూ ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు. మీకు ఓటేస్తే ... ఈ ఓట్లన్నీ మరో పార్టీకి గుత్తగా అమ్మేయరనే గ్యారంటీ ఏమిటీ.

ఓటుతో గద్దెనెక్కిస్తే కోట్ల రూపాయలకు అమ్ముడైపోయిన ప్రజాప్రతి‘నిధుల’కా మేం ఓట్లేయాలా. ఇక ఎంపీ అభ్యర్థి మామగారు ... ఈ ఐదేళ్లు ఎంపీగా ఉండీ చేసిందేమీ లేదు. హోదా కోసం వాళ్ల పార్టీ నేత ఆమరణ...! నిరాహార దీక్ష చేస్తే ‘పెరిగిన కొవ్వు కరగడాని’కన్నట్టుగా ఎకసెక్కాలకు దిగి ... హోదాగ్నిపై నీళ్లు జల్లిన ఈయనా మనకు నేత. ఢిల్లీలో తలపడాల్సిన ఈయన నిజ జీవితంలో కూడా ‘నటిస్తూ’ ఈ సారి మొహానికి రంగు మార్చినట్టుగా తన కోడలికి ఎన్నికల రంగు పులిమి మా ముందు నిలబెట్టారు. మహిళాద్వయానికి ఏమి చూసి ఓటు వేయాలి...? పోటీ చేయాలని ఆలోచన ఉంటే కనీసం ఏడాది ముందునుంచైనా ఓటర్లతో మమేకమవకుండా ఇప్పుడు ‘తగుదనమ్మా’నంటూ వస్తే మేమేమైనా మేకలమా? ఓ పెళ్లి చేయాలంటే ఏడు తరాల చరిత్ర చూడాలని అన్నారు పెద్దలు. మంచి నేతను ఎంపికచేసుకునే ముందు కనీసం ఓ తరం చరిత్ర కూడా చూడొద్దా..? మా ఓటే మాకు వజ్రాయుధం... విచక్షణతో ఓటేస్తాం.                                     
– కృష్ణారావ్‌...      

మరిన్ని వార్తలు