పొలిటికల్ టూర్

16 Mar, 2014 02:37 IST|Sakshi
పొలిటికల్ టూర్

కాంగ్రె స్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా..? కమలాన్ని అడ్డుపెట్టుకుని సైకిల్ ఎక్కేందుకు పొలిటికల్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారా..? అవుననే చెబుతున్నారు పురందేశ్వరి అనుయాయులు, పలువురు టీడీపీ నేతలు.

నేరుగా టీడీపీలో చేరితే ఎన్నికల క్షేత్రంలో మట్టికరవడం ఖాయమనే ఉద్దేశంతో పురందేశ్వరి బీజేపీలో చేరారనే విషయమై   జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పురందేశ్వరి బీజేపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈమేరకు ఆమె టీడీపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారం వెనుక పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యూహం ఉందనే  వార్తలూ లేకపోలేదు. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న దగ్గుబాటి దంపతులను టీడీపీలోకి తీసుకురావడానికి ఎన్‌టీఆర్ కుటుంబం విశ్వప్రయత్నాలు చేసింది.

పార్లమెంట్‌లో ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ రోజునే ఇందుకు బీజం పడినట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబ సభ్యులంతా టీడీపీలో ఉండాలని, పురందేశ్వరి టీడీపీలోకి రావాలని ఆమె సోదరుడు బాలకృష్ణ కోరారు. అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి నేరుగా టీడీపీలో చేరితే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతో ఆమె బాలకృష్ణ ప్రతిపాదనను కాస్త పక్కనపెట్టారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పర్చూరు నియోజకవర్గంలో ఆయనను టీడీపీలోకి ఆహ్వానిస్తూ కొన్ని ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. దగ్గుబాటి టీడీపీలోకి రావడాన్ని ఇష్టపడని నేతలు ఆయన ఫ్లెక్సీలను దహనం చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

అయితే పురందేశ్వరిని బీజేపీ ద్వారా టీడీపీకి దగ్గర చేసేందుకు దగ్గుబాటి స్వయంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను కాంగ్రె స్‌ను వీడినట్లు చెప్పుకుంటున్న పురందేశ్వరికి.. విభజనకు బీజేపీ కూడా కారణమనే విషయం తెలియదా అని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన పురందేశ్వరి, ఎన్నికల తర్వాత టీడీపీలో చేరడం లాంఛనమేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే టీడీపీ కోటాలో ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వాలని రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

 ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా..

 బీజేపీ తరఫున ఒంగోలు పార్లమెంట్  అభ్యర్థిగా పురందేశ్వరి బరిలోకి దిగనున్నారు. ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని టీడీపీలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న కరణం బలరాంను ఒప్పించి, ఒంగోలు స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. కరణం బలరాంను అద్దంకి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేశారు.  

>
మరిన్ని వార్తలు