రాజకీయంగా జేసీ బ్రదర్స్‌కు పెద్దదెబ్బే!

9 Jul, 2017 08:24 IST|Sakshi
రాజకీయంగా జేసీ బ్రదర్స్‌కు పెద్దదెబ్బే!

► జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రిలో వ్యతిరేక పవనాలు
► నేడు బీజేపీలో చేరనున్న ప్రభోదానందస్వామి కుమారుడు
► కేంద్ర, రాష్ట్ర మంత్రులు రవిశంకరప్రసాద్, మాణిక్యాలరావు తాడిపత్రికి రాక
► మట్కా, పేకాటపై డీఐజీ, ఎస్సీ సీరియస్‌...74మందితో జాబితా సిద్ధం !
► అధికశాతం మంది అధికార పార్టీ నేతలు, జేసీ అనుచరులే


అనంతపురం: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా?  స్వపక్ష నేతలు జేసీ బ్రదర్స్‌ వైఖరి తాళలేక పార్టీకి దూరమవుతున్నారా? మిత్రపక్షం బీజేపీ నేతలు వీరి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా? ప్రభోదానంద ఆశ్రమం విషయంలో వారి జోక్యం రాజకీయంగా చిక్కులు తెచ్చిపెడుతోందా? తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేయడం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో జేసీ బ్రదర్స్‌ డైలమాలో ఉన్నారు. దీంతోపాటు రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత తాడిపత్రి పేకాట, మట్కాపై డీఐజీ, ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిలో అధికశాతం మంది జేసీ అనుచరులే ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి తాజా పరిణామాలతో జేసీ బ్రదర్స్‌తో పాటు వారి అనుచరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  


తాడిపత్రి కేంద్రంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీ అవినీతిపై కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితోనూ విభేదించి పోరాడారు. ఉన్న కౌన్సిలర్లలో జయచంద్రారెడ్డి బలమైన నేత.  ఈయన పార్టీకి దూరం కావడంతో స్వపక్షసభ్యులు జేసీ బ్రదర్స్‌ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘ఎవరైనా మా మాట వినాల్సిందే. లేదంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయిస్తాం’. అనే ధోరణిలో సంకేతాలు పంపడం ఏమిటని బాహాటంగానే నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రభోదానంద ఆశ్రమం నిర్వాహకులు.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై గతనెల 29న హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

ఆశ్రమానికి ఇసుక రవాణా చేస్తున్న లారీ అంశంలో దాసరి వెంకటేశ్‌ అనే వ్యక్తి మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని బీజేపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణించి ఆశ్రమ నిర్వాహకులకు అండగా నిలిచారు. ఇదేరోజు తాడిపత్రి వాసి పైలా నర్సింహయ్యకు చికిత్స విషయంలోనూ జేసీపీఆర్‌ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడం, ప్రభాకర్‌తో తనకు ప్రాణహాని ఉందని పైలా పేర్కొనడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. ఈక్రమంలో తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం కూడా కలకలం రేపింది. పేకాటతోనే ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది, మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికారపార్టీ నేతలు, కార్యకర్తలే అధికంగా ఉన్నారు. వెరసి ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటిలో ‘బ్రదర్స్‌’ పాత్రపై కూడా ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది.

నేడు బీజేపీలోకి వివేకానంద
ప్రభోదానంద ఆశ్రమనిర్వహణకు జేసీ బ్రదర్స్‌ అడ్డుపడుతున్నారనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చారు. దీంతో వీరిని రాజకీయంగానే ఎదుర్కోవాలని సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రభోదానంద స్వామి కుమారుడు వివేకానందచౌదరి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇతను కాకినాడలో ఉంటున్నారు. తాడిపత్రిలో ఆశ్రమంలో బీజేపీలో చేరి క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి నేడు చిన్నపొడమల ఆశ్రమానికి రానున్నారు.

వీరి సమక్షంలో వివేకానంద పార్టీలో చేరనున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసేపనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి రాకతో టీడీపీ నుంచి బలమైన వర్గం వైఎస్సార్‌సీపీకి దగ్గరవుతోంది. జేసీ బ్రదర్స్‌ అధికారంలో ఉండటంతో వారి నుంచి ఇబ్బందులు ఎదురవుకుండా టీడీపీలో కొనసాగుతున్నారు. మంచి సమయం చూసి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈక్రమంలో బీజేపీ రూపంలో మరోదెబ్బ తగలడం, అందులోనూ టీడీపీకి మిత్రపక్షంగా బీజేపీ ఉండటం, ఇందులో జేసీని వ్యతిరేకించేవారు చేరడంతో రాజకీయంగా జేసీ బ్రదర్స్‌కు పెద్దదెబ్బే!

అనుచరులను కాపాడుకోవడంపై దృష్టి
రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ అశోక్‌కుమార్‌ తాడిపత్రి పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా 74మందితో ఓ జాబితాతో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా మట్కా, పేకాట రాయుళ్ల జాబితాను ఎస్పీకి సమర్పించినట్లు తెలుస్తోంది. తాడిపత్రి పోలీసులు చురుగ్గా లేరనే కారణంతో అనంతపురం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి తనిఖీలు చేయించే యోచనలో ‘పోలీస్‌ బాస్‌లు’ ఉన్నారు.

అరెస్టుల తర్వాత ఇన్నిరోజులు పేకాట, మట్కా నిర్వహణలో తాడిపత్రి పోలీసుల వైఫల్యంపై కూడా వారు ఆరా తీసి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మట్కా, పేకాట నిర్వహించేవారిలో అధికశాతం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే ఉన్నారు. ఇప్పటికే తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లు తాడిపత్రి వదిలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలిసింది. దీంతో అధికార పార్టీ నేతలను కాపాడితే పేకాట, మట్కాకు అండగా నిలిచిలిన వాళ్లవుతారు? వదిలిస్తే సొంతపార్టీ నేతలు తమను కాపాడలేదు అనే ధోరణిలో పార్టీకి దూరం అవుతారు. ఈ క్రమంలో మొత్తం పరిణామాలతో జేసీ బ్రదర్స్‌ చక్రబంధంలో ఇరుక్కున్నట్లు తాడిపత్రి వాసులు చర్చించుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు