ఫూలు.. చెవిలో పూలు!

1 Apr, 2019 13:23 IST|Sakshi

బాగులేదు.. ఏమీ బాగులేదు.. అస్సలేమీ బాగులేదు. ఏం చేయాలో ఏమీ పాలుపోవడం లేదు. బాబు గారికి గంగవెర్రులెత్తుతున్నాయి. భూమ్యాకాశాలు గిర్రున తిరుగుతున్నాయి. కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టు ఉంది. కాసేపటి కిందట వేగు విభాగం ప్రధానాధికారి ఇచ్చిన కాగితంలో సమాచారం ఇంకా కళ్ల  ముందు ఉన్నట్టే ఉంది. అందులో అంకెలు తనను చూసి ఎగతాళి చేస్తున్నట్టే ఉంది. దానికి జస్ట్‌ కొన్ని గంటల కిందట.. అంటే ముందురోజు అర్థరాత్రి... తనను నెత్తి మీద పెట్టుకు మోసే పత్రిక బాస్‌ నుంచి వచ్చిన ఫోన్‌.. ఆప్పుడు అతడి మాటలు.. ఇంకా తన చెవిలో మార్మోగుతున్నట్టే ఉంది. అంకెలయినా.. మాటలైనా.. అవి ములుకులై, ఈటెలై తన ఒళ్లంతా గుచ్చుతున్నట్టే ఉంది. అయిపోయింది. అంతా అయిపోయింది. అనుకున్నట్టే.. భయపడినట్టే అయింది.

‘ఎన్నికల్లో మన పని క్లోజ్‌. వియ్‌ ఆర్‌ ఫినిష్డ్‌. మహా వస్తే ముప్‌పై. అంతే.’ ఆ రెండు మాటలనేసి ఆహా మీడియా చైర్మన్‌ ఫోన్‌ కట్‌ చేసినప్పుడు.. గుండెల్లోనుంచి తన్నుకొచ్చిన బాధ ఇంకా పచ్చి పుండులా ఏడిపిస్తూ ఉంటే.. దెబ్బ మీద దెబ్బలా ఉదయాన్నే ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఇచ్చిన కాగితంలో అంకెలు ఆ పుండును మరింత కెలికి.. నొప్పి తలలోకి పాకి.. ఛ.. బాబుగారు ఒక్కసారి తల విదిల్చారు. ఏమిటీ వైపరీత్యం... తనకు భయమా.. తనకు బాధా? నెవర్‌.. అసలా ఫీలింగే రాకూడదు. రాదు కూడా. పదవి కోసం ఎన్ని ఎత్తులు వేసిన తెలివితేటలు తనవి. అధికారం కోసం ఎందరి తలలనో తొక్కుకుంటూ వచ్చిన నేర్పు తనది. ఎవరో.. వాళ్లు ఎవరైనా చెప్పిన రెండు మాటలను బట్టి తాను కుంగిపోవడమా? నో.. నెవర్‌! ఇంకా సమయముంది. తన దగ్గర ఇంకా తిరుగులేని అస్త్రాలున్నాయి. అవి పని చేస్తాయి. అవును. తనకా నమ్మకముంది. ఎస్‌. ఐ కెన్‌ డూ. ఎస్‌. ఐ విల్‌ డూ. ఆ ఆలోచన రాగానే ఎక్కడ లేని ధైర్యమొచ్చింది. వెంటనే మొబైల్‌ తీశారు.

‘హలో వేరా.. అర్జెంటుగా రావాలి.’‘నేను ముంబై వెళ్తున్నా. మన పని మీదే. రేపొస్తా.’‘కాదు. అది కేన్సిల్‌. ఇప్పుడే ఇంటికి రా.’అటువైపు కాసేపు నిశ్శబ్దం. ‘సరే. ఇప్పుడే బయల్దేరుతున్నా.’

బాబు గారి ఇంట్లో..‘ఈ విషయం నేనూ అటూ ఇటూగా విన్నాను. మొదట్లో మనకి ఫర్వాలేదనుకున్నాను. రోజురోజుకీ పరిస్థితి మారుతోందని, మనకు ఎదురుగాలి వీస్తోందని మా వాళ్లూ చెబుతున్నారు.’ నెమ్మదిగా అన్నాడు వేరా.

‘ఇప్పుడు ఎవరేమంటున్నారన్నది కాదు ప్రశ్న. మనమేం చేస్తామన్నదే పాయింటు.’ విసుగ్గా అన్నారు బాబుగారు.
‘మన సైన్యం మరింత జాగ్రత్తగా పనిచేయాలి. ఆ విషయాన్ని నువ్వు మనవాళ్లతో ఇప్పటికే చెప్పే ఉంటావు. పోతే.. నాదో ఆలోచన’
‘ఏమిటది?’ అతృతగా అడిగారు బాబుగారు.

‘నమ్మినా, నమ్మకపోయినా ఇప్పుడున్నది ఒకే మార్గం. నాకు తెలిసిన ఓ తాంత్రికుడున్నాడు. చాలా పవర్‌ఫుల్‌. అతడిని కలిసి ఏం చేయాలో అడుగుదాం. నన్ను నమ్ము. ఫలితం ఉంటుంది.’ అన్నాడు వేరా.
‘సర్లే అదీ చేద్దాం. ఈలోగా మనవాళ్లందరినీ అలర్ట్‌ అవమని చెప్పు.’ కుర్చీలో వెనక్కు వాలుతూ అన్నారు బాబు గారు.
‘మరేం ఫర్వాలేదు. మీ పనవుతుంది. సకాలంలో వచ్చారు నా దగ్గరికి.’ అన్నాడు తాంత్రికుడు గంభీరంగా.’ ‘రేపే పని మొదలెడతాను.. మీరు ధైర్యంగా ఉండండి. నాది భరోసా.’ అన్నాడు.
‘ఏదో ఒకటి చేసి పరిస్థితిని మాకు అనుకూలంగా చేయాలి స్వామీ. మీరు ఏదన్నా మేం సిద్ధం.’ అన్నాడు వేరా. ‘అదేం లేదు. మీరడిగారు కాబట్టి చేస్తున్నాను.’ అన్నాడు తాంత్రికుడు.
తాంత్రికుడి యాగం పూర్తయింది. పోలింగ్‌ పూర్తయింది. ఫలితాలు వచ్చాయి. అద్భుతం. తాంత్రికుడు చెప్పినట్టే జరిగింది. అసాధారణం. తమకు తిరుగులేని ఆధిక్యం. అసలేం జరిగిందో.. ఏ అద్భుతం జరిగిందో ఏమీ అర్థం కావడం లేదు. టీవీల్లో హోరు. ఊరంతా గగ్గోలు. ఏమిటిది? ఏమైంది? గ్రేట్‌.. వేరా.. యూ ఆర్‌ గ్రేట్‌.. యాహూ.. మై గాడ్‌.. ఏమైంది.. ఏమిటీ ఆనందం.... ఆహా. ఓహో....
వీపు మీద ఛెళ్లున ఎవరో కొట్టడంతో బాబుగారికి ఒక్కసారి మెలకువ వచ్చింది. వెనకన మనవడు.. ‘తాతగారూ. ఏప్రిల్‌ ఫూల్‌.. ఏప్రిల్‌ ఫూల్‌’.. సంబరంతో అరుస్తున్నాడు.

వెనకాలే వచ్చిన కోడలు అంది. ‘హుష్‌.. తాతగారు నిద్రలో ఉన్నారు. డిస్ట్రబ్‌ చేసేశావా వెధవా. సారీ అండీ.. మీ దగ్గరికి ఎలా వచ్చేశాడో చూడలేదు. వీడికి ఏప్రిల్‌ ఫస్ట్‌ అంటే తెలియదు కానీ అందరినీ ఏప్రిల్‌ ఫూల్‌ చేసేస్తున్నాడు. వీడూ వీడి అల్లరీ... అన్నట్టు వేరాగారు మళ్లీ ఫోన్‌ చేశారు. మీకు ఇందాక ఏదో చెప్పారట. అదేం కుదరదని ఆయనెవరో అనేశాట్ట. మీరు నిద్ర పోయారని చెప్పాను. మళ్లీ మాట్లాడతానన్నారు.’ కోడలు ఏదో చెబుతూ ఉంది కానీ బాబుగారికి వినిపించలేదు.‘నిజమే.. ఏప్రిల్‌ ఫూల్‌.. తను నిజంగానే ఏప్రిల్‌ ఫూల్‌..’ గొణుక్కున్నారు.          – బి.ఎస్‌.రామచంద్ర రావు

మరిన్ని వార్తలు