తమిళనాడులో పట్టుబడిన డబ్బు మాదే..! 

18 Jul, 2020 11:14 IST|Sakshi
 ఇన్‌కంటాక్స్‌ నోటీసు చూపుతున్న నల్లమల్లి బాలు

తమిళనాడులో పట్టుబడిన డబ్బుతో రాజకీయ నాయకులకు, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు 

బంగారం కొనుగోలుకు మా మనుషులు తీసుకెళ్తున్నారు 

విలేకర్ల సమావేశంలో బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు

సాక్షి, ఒంగోలు‌: తమిళనాడులో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నగదు ఒంగోలుకు చెందిన ఎన్‌వీఆర్‌ జ్యూయలర్స్‌కు చెందిందని ఆ సంస్థ యజమాని నల్లమల్లి బాలు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక గోల్డ్‌మర్చంట్స్‌ అసోసియేషన్‌ కల్యాణ మండపంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తాతా ప్రసాద్, కార్యదర్శి పి.రమేష్‌లతో పాటు అసోసియేషన్‌ సభ్యులు, ఎన్‌వీఆర్‌ జ్యుయలర్స్‌ అధినేత నల్లమల్లి బాలు పోలీసులకు పట్టుబడిన నగదు విషయమై వివరించారు. ఈ సందర్భంగా నల్లమల్లి బాలు మాట్లాడుతూ శ్రావణ మాసం వస్తున్న సందర్భంగా హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తున్న తాము బంగారం కొనుగోలు చేయడానికి తమిళనాడుకు తమ గుమస్తాలను నగదుతో పంపించామన్నారు. పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తున్న సందర్భంగా రూ. 5,22,50,000 కారులో పంపామన్నారు. అయితే పోలీసుల తనిఖీల సందర్భంగా పట్టుబడటంతో ఆ నగదును తమిళనాడుకు చెందిన ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులకు అప్పగించారని ఆయన వెల్లడించారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు 

ఆదాయపన్ను శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ఒంగోలుకు వచ్చి మా షాపు, ఇళ్లు తనిఖీలు చేశారని వివరించారు. ఈ సందర్భంగా తమిళనాడులో పట్టుబడిన నగదుకు సంబంధించి నోటీసు కూడా ఇచ్చారన్నారు. ఆ డబ్బుకు లెక్కను చూపించమని కోరారని వెల్లడించారు. అయితే నగదు పట్టుబడినప్పటి నుంచి రాజకీయ నాయకులకు, పార్టీలకు సంబంధించిందని మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.  ఈ నగదుతో ఏ రాజకీయ నాయకుడికీ సంబంధం లేదన్నారు. గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తాతా ప్రసాద్‌ మాట్లాడుతూ బంగారు వ్యాపారి నల్లమల్లి బాలుకు చెందిన నగదు పట్టుబడటంతో ఆ నగదు రాజకీయ నాయకులదేనని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని వివరించారు.

ఆదాయ పన్నుతో పాటు ప్రభుత్వాలకు చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు ఎన్‌వీఆర్‌ జ్యుయలర్స్‌ యజమానులు చెల్లిస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రకంపనలు చేయడమే కొంతమంది పనిగా పెట్టుకున్నారని అవి ఏ రాజకీయ పారీ్టకి చెందిన నాయకుడి నగదు కాదన్నారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ వ్యవహారం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు కాలం చెల్లిన స్టిక్కర్‌ను తమ డ్రైవర్‌ విజయ్‌ కారుకు అంటించుకున్నాడన్నారు. అది గిద్దలూరు ఎమ్మెల్యేకు చెందినదని తరువాత మాకు తెలిసిందని ఆయన వివరించారు. సమావేశంలో సూపర్‌ బజార్‌ చైర్మన్, బంగారు వ్యాపారి వేమూరి సూర్యనారాయణ (బుజ్జి), అసోసియేషన్‌ సభ్యులు దాసరి నారాయణరావు, నల్లమల్లి కుమార్‌లతో పలువురు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు