చేనేత ఎన్నికల్లోనూ రాజకీయం

20 Jun, 2015 08:19 IST|Sakshi

నామినేషన్లు పూర్తి
4 సొసైటీలు ఎకగ్రీవం
మూడింటిలో పోటీ తప్పదా..
తమ్ముళ్ల తీరుతో
వేడెక్కిన వైనం
వింజమూరులో నామినేషన్లు నిల్


వెంకటగిరి: ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియ రసకందాయంగా మారింది. పార్టీ రహితంగా జరగాల్సిన ఎన్నిక రాజకీయరంగు పులుముకుంది. ఒకే కుటుంబంగా ఉండే చేనేతల్లో సొసైటీ ఎన్నికలే వేదికగా తెలుగు తమ్ముళ్లు గతంలో ఎన్నడూలేని విధంగా రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 8 సొసైటీల్లో జరిగిన నామినేషన్లు ప్రక్రియలో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. వెంకటగిరిలోని శ్రీ రాజరాజేశ్వరి చేనేత సహకార సంఘానికి జిల్లా ప్రణాళికాబోర్డు మాజీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు నక్కా వెంకటేశ్వరరావు ప్యానెల్ ఎకగ్రీవమైంది. ఇక బంగారుపేటలోని వరలక్ష్మి చేనేత సహకారసంఘంలోని కూనా మల్లికార్జున్ ప్యానెల్, అరుణాచలం ప్యానెల్‌లు పోటీపడుతున్నాయి. ఈ సొసైటీలోని తొమ్మిది డెరైక్టర్లకు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక బంగారుపేట చేనేత సహకార సంఘంలో టీడీపీలో వర్గపోరు ముదిరిపాకాన పడింది. టీడీపీకే చెందిన రంగరాజన్
 
 
అదేపార్టీకి చెందిన సజ్జా హరి ప్యానెల్‌కు పోటీగా తన వర్గం వారిని ఏడు డెరైక్టర్లకు నామినేషన్ వేయించారు. తొమ్మిది డెరైక్టర్లకు 20మంది నామినేషన్లు వేయగా మహిళలకు చెందిన రెండు డెరైక్టర్ పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. దీంతో ఆ సొసైటీలో సజ్జాహరి ప్యానెల్‌కు చెందిన మహిళా డెరైక్టర్లు ఎకగ్రీవం కానున్నారు. ఇక జిల్లాలోని గూడూరు మండలం చెన్నూరు చేనేత సహ కార సంఘంలో లక్ష్మీనారాయణ ప్యానల్ కటికాల శ్రీనివాసులు ప్యానెల్‌తో పోటీపడుతోంది. ఆ సొసైటీలో తొమ్మిది డెరైక్టర్లకు 25 మంది నామినేషన్లను దాఖలు చేశారు. సూళ్లూరుపేట మండలం దామానెల్లూరు చౌడేశ్వరి సొసెటీలో యర్రా హేమభూషణం ప్యానెల్‌లోని తొమ్మిది మంది, మన్నారు పోలూరు సొసైటీలో సుబ్రమణ్యం ప్యానెల్‌కు చెందిన తొమ్మిది మంది, కసుమూరు కోదండరామ చేనేత సహకార సంఘానికి రామకృష్ణ ప్యానెల్‌లోని తొమ్మిదిమంది మాత్రమే నామినేషన్‌లు వేశారు. దీంతో ఆ సొసైటీలు ఎకగ్రీవం కానున్నాయి.
 
వింజమూరులో నిల్
వింజమూరులోని శ్రీ శ్రీనివాస ప్రాథమిక చేనేత సహకార సంఘం ఎన్నికల్లో పోటీకి నేతన్నలు నిరాసక్తత చూపడం చర్చనీయాంశమైంది. అ సొసైటీ ఎన్నికలకు శుక్రవారం నిర్వహించిన నామినేషన్లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని జిల్లా చేనేత జౌళీ శాఖ ఏడీ బాజ్జీరావు తెలియజేశారు. ఆ సొసైటీ ఎన్నిక నిలిచిపోయినట్లేనని ఆయన తెలియజేశారు.

పరిశీలన నేడు...
శుక్రవారం నిర్వహించిన ప్రాథమిక చేనేత సహకార సంఘాల డెరైక్టర్ల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. శనివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించనుండటంతో ఒక్కో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతోపాటు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. పరిశీలనలో తమ నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా పక్కాగా పూరించామని అయితే ఎంతో కొంత ఆందోళన ఉందని పలువురు అభ్యర్థులు సాక్షికి తెలియజేశారు.

మరిన్ని వార్తలు