పోలింగ్ నేడే

6 Apr, 2014 01:58 IST|Sakshi
పోలింగ్ నేడే

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి విడత పోరుకు రంగం సిద్ధమైంది. విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లలోని 26 మండలాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులు శనివారం పర్యవేక్షించారు. విజయవాడ డివిజన్‌లోని 293 ఎంపీటీసీ స్థానాల్లో 774 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

14 జెడ్పీటీసీ స్థానాల్లో 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం డివిజన్‌లోని 12 మండలాల్లో 157 ఎంపీటీసీ స్థానాలకు  413 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 12 జెడ్పీటీసీ స్థానాలకు 51 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. విజయవాడ డివిజన్‌లోని 14 మండలాల్లో 7,41,619 మంది, మచిలీపట్నం డివిజన్‌లోని 12 మండలాల్లో 4,14,503 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా రెండు డివిజన్లలోని 26 మండలాల్లో 11,56,122 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు బీఎల్‌వోల ద్వారా ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశారు. ఇంకా ఎవరికైనా ఓటరు స్లిప్‌లు అందకుంటే పోలింగ్ స్టేషన్ల వద్ద ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పోలింగ్ స్టేషన్ల వద్ద షామియానాలు, తాగునీటి వసతి కల్పించారు.
 
ఎన్నికల సామాగ్రి అందజేత...
 
మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఓటర్ల జాబితాలు ఇతరత్రా ఎన్నికల సామగ్రిని శనివారం అందజేశారు. మండల విస్తీర్ణాన్ని బట్టి రూట్లు, జోన్లుగా విభజించి ఎన్నికల సిబ్బందిని గ్రామాలకు పంపారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌కు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ముగ్గురిని నియమించారు. మొదటి విడతలో జరిగే ఎన్నికలకు 7,185 మంది సిబ్బందితో పాటు 719 మందిని రిజర్వులో ఉంచారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎస్పీ జె.ప్రభాకరరావు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచుతామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు.
 
తొలివిడత ఎన్నికలు జరిగే మండలాలివే...
 
విజయవాడ రెవెన్యూ డివిజన్‌లోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనుమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మచిలీపట్నం డివిజన్‌లోని అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గూడూరు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, పెడన మండలాలు ఉన్నాయి.
 
జోరుగా మద్యం, నగదు పంపిణీ :
 
తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఒక్కరోజు వ్యవధే మిగిలి ఉండటంతో శనివారం గ్రామాల్లో నగదు, మద్యం పంపిణీ జోరుగా సాగాయి. పోలీసుల బందోబస్తు ఉన్నా అభ్యర్థుల అనుచరులు గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేశారు. శుక్రవారం సాయంత్రమే ప్రచారం ముగియటంతో శనివారం అంతా ఆయా గ్రామాల పెద్దలు, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కుల సంఘాలు, ఆయా సామాజిక వర్గాల పెద్దలు తదితరులతో చర్చలు జరిపి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
 

>
మరిన్ని వార్తలు