తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్‌

11 Apr, 2019 07:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రారంభమైంది. తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా..  తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. పలు చోట్ల ఈవీఎం మొరాయించడంతో చిన్నచిన్న సమస్యలు తలెత్తాయి.  ఎలాంటి సాంకేతికమైన సమస్యలు తలెత్తకుండా ఉదయం 5.30 గంటల నుంచి మాక్‌ పోలింగ్‌ను నిర్వహించారు.

ఏపీలో 46,120 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయగా.. తెలంగాణలో మొత్తం 34,603 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు దేశ వ్యాప్తంగా నేడు తొలి విడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 91 పార్లమెంట్‌ స్థానాలకు కూడా పోలింగ్‌  ప్రారంభమైంది. సున్నితమైన, సమస్యత్మాక ప్రాంతాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. 

>
మరిన్ని వార్తలు