కాలుష్య నివారణ దిశగా అడుగులు

7 Mar, 2015 01:31 IST|Sakshi

మే నెలలో గోదావరి శుద్ధి కార్యక్రమం  తీరంలో ప్లాస్టిక్‌పై నిషేధం  ‘సాక్షి’ కథనానికి స్పందన
 
రాజమండ్రి : కాలుష్యం కోరల నుంచి గోదావరికి విముక్తి కలిగించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మలినాలను తొలగించి పుష్కరాలనాటికి నదీజలాలను కాలుష్యరహితం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నదీ కాలుష్యంపై ‘కాలుష్య కాసారం’ శీర్షికన గత నెల 28న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్..  ఈ బాధ్యతను ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు హెచ్.అరుణ్‌కుమార్, కాటమనేని భాస్కర్‌లకు అప్పగించారు.

మే నెలలో గోదావరి నది నీటిమట్టం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కాలుష్యం కూడా ఎక్కువవుతుంది. ఆ సమయంలో తీరగ్రామాల్లో నదిలో పెరిగిన నాచు, ఇతర పదార్థాలను తొలగిస్తారు. నీటి అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతారు. ఇందుకు మత్స్యకారుల సహకారం తీసుకుంటారు. స్నానఘట్టాల్లో గోదావరిని కలుషితం చేయవద్దనే బోర్డులు పెట్టి సేవాసంస్థల ఆధ్వర్యంలో నిఘా ఉంచుతారు. ఈ బాధ్యతను ప్రధానంగా ఆధ్యాత్మిక సేవాసంస్థలకు అప్పగించాలని ప్రసాద్ సూచించారు. నదీ కాలుష్యాన్ని నివారించాలనే నినాదంతో ఘాట్‌ల వద్ద ఇప్పటినుంచే ప్రచారం చేపట్టే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు.

ఇందుకోసం ఇప్పటికే యానాం ఎమ్మెల్యే ముందుకు వచ్చినట్టు సమాచారం. గోదావరి తీర గ్రామాల్లో పారిశుధ్య చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. రాజమండ్రిలోని పలు స్నానఘట్టాల్లో వేలాదిగా ప్లాస్టిక్ వ్యర్థాలు తేలుతూంటాయి. నగరంలోని మురుగు కాలువల ద్వారా ఇవి నదిలో చేరుతున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని నదీతీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు