‘కారు’ చీకట్లు, 12లక్షల మంది బలి!

21 Sep, 2017 08:55 IST|Sakshi
‘కారు’ చీకట్లు, 12లక్షల మంది బలి!
- బస్సుల్లో కంటే కార్లలోనే కాలుష్యం ముప్పు ఎక్కువ 
దేశంలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం 
ఏటా 12లక్షల మంది మృత్యువాత 
ఢిల్లీ ఐఐటీ, వాషింగ్టన్‌ యూనివర్సిటీ అధ్యయనం    
 
సాక్షి, అమరావతి బ్యూరో : కారు ప్రయాణికులు కూడా కాలుష్యం బారిన పడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దిల్లీ ఐఐటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ సంయుక్తంగా దిల్లీలో వాహన కాలుష్యంపై అధ్యయనం నిర్వహించాయి. అత్యంత ప్రమాదకర వ్యర్థ పదార్థం బ్లాక్‌ కార్బన్‌ మసి ప్రయాణికులపై కలిగిస్తున్న దుష్ప్రభావాన్ని ప్రధానంగా పరిశీలించారు. ఆ అధ్యయన నివేదిక పర్యావరణ సమాచార పత్రిక ‘ఎల్సేవియర్‌ జర్నల్‌’లో ప్రచురించారు. అందరికంటే ఎక్కువగా రిక్షా ప్రయాణికులు కాలుష్యం బారిన పడుతున్నారని వెల్లడైంది. రెండో స్థానంలో ఆటో ప్రయాణికులు, మూడో స్థానంలో ద్విచక్ర వాహనదారులు ఉన్నారు.

సీఎన్‌జీ సిటీ బస్సు ప్రయాణికులు, కారు ప్రయాణికులపై కూడా కాలుష్యం ప్రభావ అంశం అందర్నీ విస్మయపరిచింది. సీఎన్‌జీ సిటీ బస్సులో ప్రయాణికుల కంటే డీజిల్‌ కారులో ప్రయాణికులు ఎక్కువగా ‘బ్లాక్‌ కార్బన్‌’ బారిన పడుతున్నారని వెల్లడైంది. దిల్లీలో అన్నీ సీఎన్‌జీ సిటీ బస్సులే ఉన్నాయి.  విజయవాడలో దాదాపు 300 సీఎన్‌జీ సిటీ బస్సులున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 200 సీఎన్‌జీ బస్సులున్నాయి. కాబట్టి ఆ అధ్యయనం విజయవాడ, హైదరాబాద్‌లలో సిటీ బస్సు, కారు ప్రయాణిలకు కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  
 
బ్లాక్‌ కార్బన్‌... అత్యంత ప్రమాదకారకం 
వాహనాలు ప్రయాణించేటప్పుడు పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనం మండుతూ బ్లాక్‌ కార్బన్‌ మసిని వెదజల్లుతాయి. బ్లాక్‌ కార్బన్‌ మసి చాలా తేలికగా ఉంటుంది. తల వెంట్రుక కంటే తేలికగా ఉండే ఈ ధూళి కణం మనం పీల్చే గాలి ద్వారా చాలా సులువుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
 
ఏటా 12లక్షల మంది బలి 
వాయు కాలుష్యంవల్ల దేశంలో ఏటా 12లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారని గ్రీన్‌ పీస్‌ ఇండియా నివేదికలో వెల్లడించింది. అందుకు ప్రధాన కారణం వాతావరణంలోని బ్లాక్‌ కార్బన్‌ మసే. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. హృద్రోగాలు ఎక్కువవుతున్నాయి. క్యాన్సర్‌కి దారితీస్తోందని వెల్లడైంది. అందువల్లే ఏటా 12లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారు. దానివల్ల దాదాపు 3 శాతం జీడీపీని దేశం నష్టపోతోంది.   

దేశంలో పొగాకు ఉత్పత్తులు సేవించడంవల్ల కూడా ఏటా 12.50 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా.  దీనిపై మరింతగా అధ్యయనం చేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. సీఎన్‌జీ సిటీ బస్సులు, మెట్రో రైళ్లు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ప్రజలు మరింతగా సద్వినియోగం చేసుకునేలా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని  అభిప్రాయపడుతున్నారు.  
మరిన్ని వార్తలు