అజ్ఞాతం వీడని ధూళిపాళ్ల!

16 Jun, 2014 11:58 IST|Sakshi
అజ్ఞాతం వీడని ధూళిపాళ్ల!

తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉండి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు తెలుగు తమ్ముళ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. కేబినెట్లో చోటుదక్కిని తమ్ముళ్లు కొంతమంది అలకబూనితే,మరి కొందరు అధినేతకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో గెలుపొందినవారంతా ఎవరికివారే మంత్రి పదవులు వస్తాయని అంచనా  వేసుకున్నారు. అయితే ఆశలన్నీ తలకిందలయ్యే సరికి వారిలో అసంతృప్తి నెలకొంది. దాంతో బెర్త్ దక్కక భంగపడిన తమ్ముళ్లలో ఒకరు ఆస్పత్రి పాలైతే...మరొకరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. దాంతో పదవుల పందారంపై టీడీపీలో రేగిన అసంతృప్తులు ఇంకా చల్లారడం లేదు.

అటువంటి వారిలో గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఉన్నారు. అయిదో సారి విజయం సాధించి...మంత్రివర్గంలో ఈసారి తనకు సీటు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయిన ఆయనకు అవకాశం దక్కలేదు. దాంతో మనస్తాపానికి గురైన ధూళిపాళ్ల ఇప్పటికీ పార్టీకి అందుబాటులోకి రాలేదు. అవకాశం దొరికినప్పుడల్లా మైక్ దొరికితే వదలి పెట్టని ఆయన ఇప్పుడు అజ్ఞాతంలో కొనసాగుతున్నారు. బాబు ప్రమాణ స్వీకారానికి కూడా ధూళిపాళ్ల డుమ్మా కొట్టారు.

అంతకు ముందు ఆయనను బుజ్జగించేందుకు పలువురు పార్టీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు ఎవరితోనూ అందుబాటులోకి రాలేదు. ఆయన ఇప్పటికి కూడా కూడా స్విచ్చాఫ్ చేసి ఉంచటంతో ఇంకా అలక కొనసాగిస్తున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

మరోవైపు ధూళిపాళ్లకు మంత్రి పదవి రాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసన కూడా తెలిపారు. ఓ దశలో  బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు యత్నించిన ఆయనను కార్యకర్తలే అడ్డుకోవటం విశేషం. అయితే మంత్రివర్గంలో చోటు దక్కనివారి సేవలను పార్టీ, ప్రభుత్వంలో వివిధ రూపాలలో ఉపయోగించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు