పేదోళ్లకు పెద్ద కష్టం

17 Oct, 2019 12:43 IST|Sakshi
మంచం పట్టిన తల్లీకూతురు సత్యవతమ్మ, రామకృష్ణమ్మ

మగదిక్కు లేని కుటుంబాన్ని 15 ఏళ్లుగా పోషిస్తున్న తల్లి

పాచిపనులు చేసుకుంటూ ముగ్గురు కుమార్తెలకు చదువులు

ఆర్థిక స్తోమత లేక మధ్యలోనే చదువులకు స్వస్తి

వలంటీర్‌ పోస్ట్‌ కోసం వేడుకున్నా కనికరించని ‘గ్రామ పెద్దలు’

ఇంతలో తినడానికి తిండి లేక మంచం పట్టిన తల్లీకూతురు

కష్టాలతో చిగురుటాకులా వణికిపోతున్న కుటుంబం

ఎవరైనా ఆదుకోవాలని వేడుకోలు 

ఆ ఇంట్లో గత 15 ఏళ్ల నుంచి ఓ మహిళ, ముగ్గురు బాలికలు నివాసం ఉంటున్నారు. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో పాచి పనులు చేస్తూ ఒకటిన్నర దశాబ్ద కాలంగా ముగ్గురు బిడ్డలను ఆ తల్లే పోషిస్తోంది. బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని ఆశపడింది. ముగ్గురినీ పదో తరగతి పైగానే చదివించింది. ఓవైపు పెళ్లీడుకొచ్చిన బిడ్డలు, మరోవైపు వారి చదువులు.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ముగ్గురూ చదువులు మానాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరికైనా పెళ్లి చేసేందుకు నలుగురూ పనులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇంతలోనే విధి వెక్కిరించింది. వారి జీవితాలను ఓ  కుదుపుకుదిపేస్తోంది.  తినడానికి సరైన తిండి లేక ‘ఆకలి’ ఆ ఇంట్లో తల్లీకూతురిని మంచాన పడేసింది. మండల కేంద్రం మెంటాడ దిగువ వీధిలోని ఓ నిరుపేద కుటుంబం దీనావస్థ ఇది.  

సాక్షి మెంటాడ: మెంటాడ దిగువ వీధిలో అరసాడ సత్యవమ్మ, తిరుపతిరావు కాపురం ఉంటుండే వారు. వీరికి ముగ్గురు కుమార్తెల సంతానం. అయితే సత్యవతమ్మ భర్త తిరుపతిరావు సుమారు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పిల్లలను పోషించేందుకు, వారిని చదివించడానికి సత్యవతమ్మ.. ఉపాధి, ఎంపీడీఓ, వెలుగు కార్యాలయాల్లో పాచి పనులు చేసేది. ఈ పనులు చేస్తూనే పెద్ద కుమార్తె లక్ష్మిని 10వ తరగతి, రెండో కుమార్తె రామకృష్ణమ్మను డైట్, మూడో కుమార్తె రాజేశ్వరిని ఇంటర్మీడియట్‌ వరకు చదివించింది. ఒక్క మహిళ సంపాదనతో నలుగురి పోషణ, ముగ్గురి చదువు భరించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మధ్యలోనే వారి చదువులు ఆగిపోయాయి. 

గంజి కూడా కాచుకోలేని దుస్థితి..
ముగ్గురు కూతుర్లూ, తాను ఏవో ఒక పనులు చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతలోనే సత్యవతమ్మకు వెన్ను, భుజం పక్క భాగంలో తీవ్రమైన నొప్పి రాసాగింది. దీంతో నెల్లిమర్ల మిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా, పరిస్థితి బట్టి వైద్యులు ఆమెకు అక్కడే ఆపరేషన్‌ చేశారు. కానీ మందులు కొనుగోలుకు, మూడు పూటలా కాస్తా గంజి నీళ్లు తాగేందుకు కూడా వారి వద్ద డబ్బు లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సరైన తిండి లేక సత్యవతమ్మ, ఆమె రెండో కుమార్తె అరసాడ రామకృష్ణమ్మ ఏకంగా మచ్చం పట్టారు. రామకృష్ణమ్మ కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తన పరిస్థితి ఇలా ఉండగా, కూతురు కూడా మంచాన పడటంతో సత్యవతమ్మ మరింత కుంగిపోయి పూర్తిగా మంచం పట్టింది.

సాయం కోసం ఎదురుచూపులు..
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి ఇంతటి కష్టం వచ్చిపడటంతో ఇంట్లో అందరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మెరుగైన వైద్యం సంగతి పక్కనపెడితే.. కనీసం తిండి కూడా లేకపోవడంతో ఇంటిళ్లపాదీ ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తారని వారు ఎదురు చూస్తున్నారు. తమకు సాయం చేయాలనుకునే వారు 9491769356 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని వారు అభ్యర్థిస్తున్నారు. 

వలంటీర్‌ పోస్ట్‌ కోసం కాళ్లు పట్టుకున్నా.. 
మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి గురించి గ్రామస్తులకు, అధికారులకు తెలుసు. కనీసం గ్రామ వలంటీర్‌ పోస్టు ఇవ్వాలని గ్రామంలో ఉన్న అందరి కాళ్లు పట్టుకున్నాను. చివరకు ఎంపీడీఓకూ మా పరిస్థితి వివరించాను. ఏ ఒక్కరూ మా కుటుంబంపై కనికరం చూపించలేదు. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నా.
– అరసాడ రామకృష్ణమ్మ (డైట్‌ , మెంటాడ )

>
మరిన్ని వార్తలు