పేదలకందని ‘ప్రయివేటు’ విద్య

23 Jun, 2014 00:33 IST|Sakshi
  •    ఉచిత విద్యకు యాజమాన్యాలు ససేమిరా
  •      అమలు కాని విద్యాహక్కు చట్టం
  •      స్పందించని ప్రభుత్వాలు
  •      నష్టపోతున్న పేద విద్యార్థులు
  • నర్సీపట్నం : పేద విద్యార్థుల్లో విద్యా సుగంధాలు పరిమళించేందుకు ప్రభుత్వాలు ప్రత్యే క చట్టాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో దానికి అనువైన పరిస్థితులు కల్పించకపోవడం వల్ల అమలు కావడం లేదు. ప్రభుత్వ విద్యను మెరుగుపరచడం, పేద విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ప్రయివేటు విద్యాసంస్థల్లోనూ పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. కానీ దీనిపై ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ఒప్పందం కుదరలేదు.
     
    విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయివేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను బట్టి 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. దీనికయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. ఒకటి నుం చి 8 తరగతుల వరకు వీటిని అమలు చేయా లి. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తే జిల్లాలోని ప్రస్తుతమున్న సుమా రు 700 పాఠశాలల్లో 25 వేలకు మించి విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
     
     ప్రయివేటు పాఠశాలల్లో అందించే విద్యకు ఎంత ఖర్చవుతుందో లెక్కించి ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఇందుకు అంగీకరించలేదు. తమ సంస్థల్లో మంచి వసతులతో నాణ్యమైన విద్యా బోధన ఉంటుంది కాబట్టి ఫీజుల్ని మరింత పెంచాలని డిమాండ్ చేశాయి. ఆ విధంగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలంటూ ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
     
     దీనిపై అయిదేళ్లుగా ఏమీ తేలకపోవడంతో ఒక వ్యక్తి ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అమలు చేయడం లేదని ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటిస్తే పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు