పేదల ఇళ్లకు సైంధవుడతడు

17 May, 2020 04:06 IST|Sakshi

కథ,స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌.. అంతా ఆయనే

పాత్రధారులూ తన వాళ్లే

లక్ష్యం 1:  ప్రభుత్వ భూములను అడవులుగా భ్రమింపజేయడం

లక్ష్యం 2:  పేదల సొంతింటి కలను కల్లగా మార్చడం

అడక్కూడనిది: నాడు 70 ఎకరాలు ‘కాంకర్‌’కు ఎలా ఇచ్చారు?  

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి తెలుగుదేశం పార్టీ మోకాలడ్డుతోంది. వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన ప్రభుత్వ రెవెన్యూ భూమిని.. ‘మడ’ అడవులు అంటూ రాజకీయం చేస్తోంది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేకపోయిన చంద్రబాబు.. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందని ట్విట్టర్‌ వేదికగా చిచ్చు రగిల్చారు. దీని ఆధారంగా తన వాళ్లతో కోర్టులో కేసు వేయించి కథ నడుపుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరం దుమ్ములపేట సమీపాన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎర్రగ్రావెల్‌తో చదును చేసిన 116 ఎకరాల ప్రభుత్వ భూమిపై చంద్రబాబు, టీడీపీ నేతలు లేని వివాదాన్ని లేవనెత్తడం పట్ల పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన 4,650 మంది నిరుపేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, బీసీ వర్గాల వారే ఉన్నారు. మహిళల పేరున పట్టాలు ఇవ్వడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

ఒకే సారి ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తే ప్రభుత్వానికి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కుట్రకు తెరతీశారు. మడ అడవులను నరికి ఇళ్ల స్థలాల కోసం చదును చేసి పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారని, దీంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని, తుపాను ముప్పు ఉంంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా రచ్చకు బీజం వేశారు. ఆ పార్టీకి చెందిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అనుచరుడైన టీడీపీ మాజీ కార్పొరేటర్‌ భర్త తుమ్మల రమేష్‌తో హైకోర్టులో కేసు వేయించి ఇళ్ల స్థలాల పంపిణీకి మోకాలడ్డారు. పైగా ఆ కేసును టీడీపీకి చెందిన మాజీ మంత్రి సమీప బంధువే వాదిస్తుండడం గమనార్హం.

ఆ అడవులతో సంబంధం లేదు..
► చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన 116 ఎకరాల భూమికి, మడ అడవులకు అసలు సంబంధమే లేదు. కోరంగి మడ అడవులు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. 
► ఈ 116 ఎకరాల భూమికి, కోరంగి మడ అడవులకు మధ్య సుమారు 10 కిలోమీటర్లు పైగా దూరం ఉంటుంది. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటం వల్ల ఈ భూముల్లో పెరిగిన చిన్నచిన్న మొక్కలను చూపి చంద్రబాబు అండ్‌ కో మడ అడవులంటూ యాగీ చేస్తోంది.
► పెద్ద, పెద్ద తుపాన్లు వచ్చినప్పుడు సైతం కాకినాడకు 6 నాటికల్‌ మైళ్ల దూరాన సముద్రం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ హోప్‌ ఐలాండ్‌ కాకినాడకు రక్షణ కవచమనే వాస్తవాన్ని వ్యూహాత్మకంగా విస్మరించారు.
► ఎలాంటి జల వనరులు లేని ఖాళీ భూమి వల్ల ఏకంగా 54 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని చంద్రబాబు ట్వీట్‌ చేయడం తగదని పలువురు ఆక్షేపిస్తున్నారు. 

ఆ భూములు ముమ్మాటికీ ప్రభుత్వానివే
కాకినాడలోని ప్రభుత్వ భూమిని పోర్టు విస్తరణ కోసం 1978లో ఇచ్చారు. అందులో చాలా ఏళ్లుగా 116 ఎకరాలు ఖాళీగా ఉండడాన్ని గుర్తించాం. కాకినాడ స్మార్ట్‌ సిటీలో ఇళ్ల స్థలాల కోసం నిరుపేదల నుంచి సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. తొలి దశలో సుమారు ఐదు వేల మంది అర్హులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించాం. పక్కాగా రెవెన్యూ భూములనే విషయం నిర్ధారించుకుని.. పోర్టు, అటవీ, మత్స్యశాఖలను సంప్రదించాకే చదును చేయించాం. ఈ భూములను మడ అడవులుగా గతంలో ఎప్పుడూ నోటిఫై చేయలేదు.      
– డి మురళీధర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌

టీడీపీ కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకువెళతాం
పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికి టీడీపీ అడ్డుపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కేంద్రంలో దశల వారీగా 30 వేల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే ఇలా అడ్డుపడడం దారుణం. వాస్తవాలను ప్రజలకు తెలియచేస్తాం. ఎన్ని అవరోధాలు సృష్టించినా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ స్థలాలు పంపిణీ చేస్తాం.    
  – ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ సిటీ.

పేదల స్థలాలకు అడ్డుపడుతున్నారు
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇతర తెలుగుదేశం నాయకులు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో అనేక కంపెనీలకు ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టి పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.      
– వాసుపల్లి కృష్ణ, మత్స్యకార నాయకుడు, కాకినాడ 

నాడు 70 ఎకరాలు ఎలా కేటాయించారు? 
► 2018లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ప్రభుత్వ భూములకు సమీపాన 70 ఎకరాలు కాంకర్‌ (కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కంపెనీకి ఎలా కేటాయించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వివాదం సృష్టిస్తోన్న 116 ఎకరాల భూమికి సమీపాన 53 ఎకరాల్లో సుమారు 1,100 ఇళ్లను టిడ్కో ద్వారా గత సర్కార్‌ నిర్మించినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?

ఇదీ వాస్తవం..
► కోరంగి పరిసర ప్రాంతాల్లో 86 వేల ఎకరాల్లో అభయారణ్యం విస్తరించి ఉంది. ప్రస్తుతం పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన 116 ఎకరాలు (సర్వే నంబర్లు 376/పి1, 374/పి1, 387, 1985/పి, 1990, 2004/పి) ఏ ప్రభుత్వ రికార్డుల్లో అభయారణ్యంగా నమోదు కాలేదు. ఇదే విషయాన్ని ఓడరేవులు, అటవీ, గుడా (గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ), మత్స్యశాఖలు స్పష్టం చేస్తున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా