-

పోర్న్‌ వీడియోలు.. చెల్లెలిపైకి ఉసిగొల్పాయి

17 Jun, 2018 11:08 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న  రూరల్‌ సీఐ రేవతమ్మ 

సోదరిపై హత్యాయత్నం చేసిన బాలుడు

జువైనల్‌ హోమ్‌కు తరలింపు

సాక్షి, నర్సీపట్నం :  పోర్న్‌ వీడియోల ప్రభావం ఓ బాలుడిని నిందితుడిగా మార్చాయి. అతనికి వరుసకు సోదరి అయిన బాలికపై లైంగికదాడి చేసేందుకు పురిగొల్పాయి, ఆపై హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో ఆ బాలిక ప్రమాదకర పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి(బీకే పల్లి) గ్రామంలో గత ఆదివారం ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి నిందితుడైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని శనివారం విశాఖపట్నం జువైనల్‌ హోమ్‌కు తరలించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. 

పోర్న్‌ వీడియోల ప్రభావంతో సోదరిపైనే అత్యాచారానికి తెగబడ్డాడని చెప్పారు. బాధితురాలు, నిందితుడిది ఒకే ఇంటి పేరు. పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. నిందితుడు ఇటీవల పదో తరగతి పాస్‌ అయ్యాడు, బాధితురాలు ఏడు నుంచి 8వ తరగతిలోకి వస్తోంది. పక్కపక్క ఇళ్లు  కావడంతో ఎప్పుడు సరదాగా ఆడుకుంటారు. ఎప్పుడూ మాదిరిగానే 10వ తేదీన ఐదుగురు పిల్లలు ఆడుకున్నారు. వర్షం వస్తుండడంతో ముగ్గురు పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు.  తమ ఇంటి నిర్మాణానికి తీసుకువచ్చిన సిమెంట్‌ బస్తాలు వర్షానికి తడవకుండా ఉండేందుకు కవర్‌ కప్పేందుకు బాధితురాలు వెళ్లింది.

ఇదే అదునుగా భావించిన నిందితుడు పాకలో ప్రవేశించి వెనుక నుంచి ఒక్కసారిగా బాలికను పట్టుకున్నాడు. భయాందోళనకు గురైన ఆ బాలిక పెద్దగా కేకలు పెట్టింది. నలుగురు వస్తే పరువుపోతుందని భావించిన నిందితుడు బాలిక మెడలో ఉన్న చున్నీతో పాక రాటకు గట్టిగా బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలిక స్పృహతప్పడంతో, పాకలో సిమెంట్‌ బస్తాలు అమ్మాయిపై పడినట్టు సీన్‌ క్రియేట్‌ చేశాడు. పరుగు పరుగున ఇంటికి వెళ్లి  చెల్లెలు సిమెంట్‌ బస్తా  కిందపడి ఉందని కుటుంబ సభ్యులతో చెప్పాడు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని  అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించారు. 

పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు ఆరోజు నుంచి ఊరిలో కనిపించలేదు. అతనిని పట్టుకుని విచారించగా వీడియోల ప్రభావంతో ఎవరైనా అమ్మాయితో అలా ప్రవర్తించాలని అనిపించేదని, కళ్లెదురుగా  సోదరి కనిపించడంతో అలా ప్రవర్తించానని పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి, మైనర్‌ కావడంతో జువైనల్‌ హోమ్‌కు తరలించినట్టు సీఐ రేవతమ్మ తెలిపారు. ఈ సమావేశంలో కోటవురట్ల ఎస్‌ఐ  మధుసుధన్‌రావు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు