ఎక్కడున్నా పింఛన్‌ 

31 Mar, 2020 02:39 IST|Sakshi

పింఛనుదారుడు వేరే ఊరిలో ఉంటే అక్కడే అందుకోవచ్చు 

ఏప్రిల్‌ నెల పంపిణీలో ‘పోర్టబులిటీ’ అమలు 

లాక్‌డౌన్‌తో పేదలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు 

1న అందరికీ పెన్షన్‌ డబ్బులు అందేలా ఏర్పాట్లు 

ఈసారి బయోమెట్రిక్, సంతకాలు, వేలిముద్రలు లేవు  

సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన అప్పల నరసింహ నిరుపేద కూలీ. విజయవాడలోని తన కుమారుడి ఇంటికి వచ్చిన ఆయన లాక్‌డౌన్‌ వల్ల  పింఛను డబ్బులపై ఆందోళన చెందుతున్నారు. సొంత ఊరు వెళ్లే మార్గం చూడాలని కుమారుడిని కోరాడు. గుంటూరు జిల్లాకు చెందిన వెంకటమ్మది కూడా అదే పరిస్థితి. లాక్‌డౌన్‌తో ఎటూ కదలలేక కుమార్తె ఇంట్లో చిక్కుకుపోయింది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ 1వ తేదీన చేపడుతున్న పింఛన్ల పంపిణీలో అప్పలనరసింహ, వెంకటమ్మ లాంటివారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్న చోటే డబ్బులు అందుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈసారి పింఛన్ల పంపిణీలో పోర్టబులిటీ అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టబులిటీ అంటే పింఛనుదారుడు పెన్షన్‌ డబ్బులను సొంత ఊరిలో మాత్రమే కాకుండా తనకు వీలున్న ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు కల్పించడం. పింఛనుదారుడు తాను ఉన్న ప్రాంతానికి చెందిన వలంటీరుకు వివరాలు తెలియజేస్తే చాలు ఇంటికే వచ్చి పెన్షన్‌ డబ్బులు అందచేస్తారు. 

కేవలం ఒక్క ఫొటోతో.. 
కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో భాగంగా ఏప్రిల్‌ నెల పింఛన్లను బయో మెట్రిక్‌ లేకుండానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల నుంచి సంతకాలు లేదా వేలి ముద్రలు సైతం సేకరించరాదని నిర్ణయించినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. అయితే పారదర్శకత కోసం లబ్ధిదారుడికి వలంటీర్లు పెన్షన్‌ డబ్బులు అందచేసే సమయంలో ఫోటో తీసుకుంటారు. ఇందుకోసం మొబైల్‌ యాప్‌ కూడా సిద్ధం చేశారు.  

సెర్ప్‌ సీఈవో జారీ చేసిన ఇతర మార్గదర్శకాలు..
పెన్షన్‌ కోసం ఏ పింఛనుదారుడు ఇంటి నుంచి బయటకు రాకూడదు. వలంటీరే వారి ఇంటికి వెళ్తారు. పంపిణీ సమయంలో భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. 
లబ్ధిదారుడి ఫోటో ఎక్కడ తీశారనే వివరాలు జియోట్యాగింగ్‌ ద్వారా యాప్‌లో నమోదవుతాయి.  
వలంటీర్లు సూర్యోదయం తరువాత పింఛన్ల పంపిణీని ప్రారంభించాలి. 
పెన్షన్ల పంపిణీకి అవసరమైన నగదును ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు,  గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మార్చి 30, 31వ తేదీలలో బ్యాంకుల నుంచి డ్రా చేసేందుకు వీలుగా జిల్లా కలెకర్లు పోలీసు శాఖకు సూచనలు చేయాలి. 
31వ తేదీ కల్లా రాష్ట్రంలో అందరు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పెన్షన్‌ నగదు డ్రా చేసి  అన్ని గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలి. 
గ్రామ, వార్డు వలంటీర్లు ఏప్రిల్‌ 1న పింఛన్ల పంపిణీ ప్రారంభించి వీలైనంత త్వరగా çపూర్తి చేయాలి.  

>
మరిన్ని వార్తలు