మళ్లీ వర్రీ

21 Nov, 2013 01:29 IST|Sakshi

 =పొంచి ఉన్న ‘హెలెన్’ గండం
 =వరి రైతు గుండెల్లో గుబులు
 =ఏజెన్సీలో కోత దశలో పంట
 =మైదానంలో పొట్ట, వెన్ను స్థితి
 =వర్షం, గాలులు తీవ్రమైతే నష్టమే

 
వరిరైతు గుండెల్లో గుబులు రేగుతోంది. మూడువారాల క్రితం ముంచేసిన భారీ వర్షాల చేదు అనుభవాలను మరచిపోకముందే మరో విపత్తు ముంచుకొచ్చింది. బుధవారం ఉదయం నుంచి అంతటా మబ్బువాతావరణం నెలకొంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గాలులు, వర్షాలు తీవ్రమైతే ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటను కోల్పోవలసిందేనని వాపోతున్నారు. హెలెన్ తుపాను ప్రభావం గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తా మండలిపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
 
అనకాపల్లి/నర్సీపట్నం, న్యూస్‌లైన్ : రైతులకు మళ్లీ కషమొచ్చింది. మూడువారాల క్రితం ముంచేసిన భారీ వర్షాల చేదు అనుభవాలను మరచిపోకముందే మరో విపత్తు ముంచుకొచ్చింది. జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతాయని వ్యవసాయశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షాల తీవ్రత మేరకు నష్టం ఉంటుందని అంటున్నారు. ఇదే జరిగితే  కోత దశలో ఉన్న వరిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఖరీఫ్ ప్రారంభంలో ఏజెన్సీలో పరిస్థితులు అనుకూలించాయి. మైదానం కన్నా మన్యంలో వర్షాలు బాగా పడ్డాయి.

దీంతో అక్కడి రైతులు సుమారు 20వేల హెక్టార్లలో వరిని ముందుగా సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట కోత దశకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభించారు. కోసిన వరిపనలు ఇప్పటికీ పొలాల్లోనే ఉన్నాయి. ఇలాంటప్పుడు వర్షాలు కురిస్తే చేతికందనున్న పంటంతా నీట మునిగి నాశనమవుతుంది. మైదానంలో అయితే వరి పొట్టదశనుదాటి కంకుల దశకు చేరుకుంది. దీనిపై కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. స్వర్ణ, 1001, 1010 రకాలు వర్షం ఏమాత్రం ఎక్కువయినా పూర్తిగా నేలకొరిగిపోతాయి.

తేలికపాటి రకాలయిన ఆర్‌జేఎల్, సాంభమసూరి, సోనా మసూరిలకు చిన్న గాలి వీచినా అధికశాతం నష్టముంటుంది. ఇప్పటికే గత నెలాఖరులో అల్పపీడనం కారణంగా సుమారుగా 25వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాయుగుండం జిల్లాపై విరుచుకుపడితే  పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు చెరకు, పత్తితో పాటు కూరగాయల పంటలన్నీ దాదాపుగా పక్వానికి వచ్చి ఉన్నాయి. ఈదురు గాలులకు చెరకు పంట నేలకొరిగిపోయే ప్రమాదముంది. పంటభూముల్లో నీరు నిల్వ ఉంటే రసనాణ్యత తగ్గిపోతుంది.  
 
 వర్షాల తీవ్రత మేరకు నష్టం

 వర్షాలకు తోడు గాలులు వీస్తే పంటలు ఒరిగిపోయే ప్రమాదముంది. ఏజెన్సీలో 50 శాతం కోతలు పూర్తయ్యాయి. కోసిన వరి పనలను రోడ్డుపై వేసుకుంటే మంచిది. ఒక వేళ తడిస్తే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పాడేరు, చింతపల్లి పరిధిలో వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజ్‌మాకు తీవ్ర నష్టం వాటిల్లింది. వలిసెలు పూత దశలోఉన్నందున దీనిపై కూడా వర్షాల ప్రభావం మెండుగా ఉంటుంది. చెరకుపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.      
 -సీవీ రామారావు, వ్యవసాయశాస్త్రవేత్త
 

మరిన్ని వార్తలు