పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

1 Sep, 2018 13:00 IST|Sakshi
పిల్లల బరువులు చూస్తున్న కార్యకర్త

నేటి నుంచి ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ అభియాన్‌

సెప్టెంబర్‌ నెలంతా అంగన్‌వాడీల్లో వివిధ కార్యక్రమాలు

ప్రకాశం, పొదిలి: పోషకాహార లోపంతో ఎదుగుదల లేని పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ బరువుతో పుట్టే పిల్లలు, బలహీనంగా ఉండే గర్భిణులు, గర్భిణుల్లో రక్తహీనత, మాతా శిశు మరణాల సంఖ్య లేకుండా చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ రకాల సేవలు అందిస్తోంది. గర్భిణులు, బాలింతలలకు పోషకాహారం తయారు చేసి కేంద్రాల్లోనే తినేలా చూస్తున్నారు. వీరికి పోషక అవసరాల్లో అధిక శాతం మాంసకృతులు, ఐరన్‌ ఇవ్వాలనేది ఐసీడీఎస్‌ లక్ష్యం. మరో వైపు పోషకాహార ప్రాధాన్యం గురించి గర్భిణులు, తల్లులకు అంగన్‌వాడీలు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ..ముఖ్య ఉద్దేశం
పోషకాహార ప్రాధాన్యం తెలియజేయడం, ఆ దిశగా ఆహార పదార్థాలు తినేలా అలవాటు చేసుకునేలా చేయడం, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఎంత అవసరమో తెలియ జేయడం, పోషకాహారాల్లో ఏయే శక్తి ఎంత మేర ఉంటుందో సమగ్రంగా తెలియజెప్పటం పోషణ అభియాన్‌ ముఖ్య ఉద్దేశం. వంటలు తయారు చేసి ప్రదర్శించడం ద్వారా గర్భిణులు, తల్లులకు అవగాహన కల్పిస్తారు.

నెలంతా కార్యక్రమాలు
జిల్లాలోని 21 ప్రాజక్టుల పరిధిలో 4244 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గర్భిణులు, బాలింతలు 43 వేల మంది, చిన్నారులు 45 వేల మంది వరకు ఉన్నారు. పోషణ అభియాన్‌లో భాగంగా సెప్టెంబర్‌ నెలంతా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు రూపొందించారు. పోషణ అభియాన్‌లో నిర్వహించే కార్యక్రమాలపై జన చైతన్యం పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. నెలలో నాలుగు వారాలకు సంబంధించి తొలి వారం గ్రోత్‌ మానిటరింగ్, రెండో వారం విద్య, మూడో వారం స్వచ్ఛత, నాలుగో వారం న్యూట్రిషన్‌కు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించారు.

న్యూట్రిగార్డెన్‌లకు ప్రాధాన్యం
ఈ పర్యాయం న్యూట్రిగార్డెన్‌లు పెంచాలని నిర్ణయించారు. ఈ గార్డెన్‌ల్లో రసాయనిక ఎరువులు వాడకుండా పెంచిన ఆకు కూరలు, కూరగాయలతో ఆహార పదార్థాలు తయారు చేసి లబ్ధిదారులకు ఇవ్వాలనేది ఉద్దేశం. ఆ దిశగా న్యూట్రిగార్డెన్‌లు జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పెంచాలని ఐసీడీఎస్‌ అధికారులు నిర్ణయించారు.

నేటి బాలికలే రేపటి తల్లులు:
యవ్వన దశలో హార్మోన్‌ల్లో జరిగే మార్పులు మూలంగా పోషకాహారం తప్పని సరి. ఎముకలకు అవసరమైన క్యాల్షియం ఇవ్వాలి. రుతు క్రమంలో రక్తాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున రక్తం పెరిగేందుకు అవసరమైన పోషకాహారం తీసుకోవాలి. ఈ దశలో ఇనుము, మాంసకృతులు అధికంగా లభించే పాలు, పప్పు, గుడ్లు, ఆకుకూరలు, బెల్లం, రాగులు రోజు వారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్‌లో ఆరోగ్యకర తల్లులుగా ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.పి.సరోజని, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్‌

మరిన్ని వార్తలు