కరోనా రోగులు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లాలి

23 Jul, 2020 12:39 IST|Sakshi

నెల్లూరు(అర్బన్‌): కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులు తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్‌ కార్డు తీసుకుని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లాలని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగార్జున బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులేకపోతే ఆధార్‌కార్డు ఆధారంగా సీఎంసీఓ లెటర్‌ను తీసుకెళ్లాలని తెలిపారు. అప్పుడు మాత్రమే ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలందుతాయన్నారు. కరోనా రోగులను తరలించేటప్పుడు 104, 108 సిబ్బంది తమతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని రావాలని రోగులకు చెప్పాలని కోరారు. ఈ విషయం తెలియక అనేక మంది రోగులు ఆస్పత్రులకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ప్యాకేజీలు ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. 

మరిన్ని వార్తలు