సానుకూలంగానే ఉందాం

27 Dec, 2014 01:11 IST|Sakshi
  • ప్రభుత్వం పట్ల టీజేఏసీ వైఖరి ఇదే!
  •  సర్కారుతో గొడవలు వద్దు
  •  జేఏసీని సజీవంగా ఉంచుదాం.. ప్రజాక్షేత్రంలో పనిచేద్దాం
  •  కమిటీ విసృ్తత స్థాయి భేటీలో చర్చ
  • సాక్షి, హైదరాబాద్: ‘‘టీజేఏసీ కార్యకలాపాలను సజీవంగా ఉంచుదాం. ప్రభుత్వ విధానాలపై సానుకూలంగానే స్పందిద్దాం. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌తో ఏ స్ఫూర్తితో కలిసి పనిచేశామో.. రాష్ట్ర పున ర్నిర్మాణంలోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శిద్దాం’’ అని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ(టీజేఏసీ) నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రావతరణ తర్వాత టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

    ఈ సమావేశంలో కమిటీ భవిష్యత్ కార్యాచరణపైనే ఎక్కువగా చర్చించారు. డివిజన్, మండల స్థాయిల్లో జేఏసీ కమిటీలు బలంగానే ఉన్నా.. జిల్లా స్థాయిలో కమిటీలపై కాస్త దృష్టి సారించాలని నేతలు అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నా.. ప్రజా క్షేత్రంలో పనిచేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తంగా ప్రభుత్వానికి సానుకూలంగానే వ్యవహరించాలని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వంతో గొడవలు వద్దన్న అభిప్రాయానికి జేఏసీ వచ్చినట్లు కనిపిస్తోంది.

    ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం: కోదండరాం

    ‘‘ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాలపై సూచనలు చేస్తాం. ఉద్యమ సమయంలో ప్రజల నుంచి వచ్చిన అనేక సమస్యల పరిష్కారానికి కూడా సూచనలు చేస్తాం. ప్రధానమైన వ్యవసాయం, విద్యుత్, విద్య, ఆరోగ్యం, సంక్షేమం తదితర రంగాల్లో నివేదికలు రూపొందించేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

    ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రానికి  పిటిషన్లు సమర్పిస్తాం. ఏఏ రంగాల్లో ప్రక్రియ నిలిచిపోయిందో వివరిస్తూ కేంద్రానికి నివేదిక ఇస్తాం’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిశాక ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రానికి సమర్పించే నివేదికను వారం రోజుల్లో పూర్తి చేస్తామని, అంతకంటే ముందు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తామన్నారు.

    హైదరాబాద్‌పై సమగ్ర అధికారాలు, జోనల్ నియామకాలు, ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం వంటి విషయాలపై డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

    ‘‘తెలంగాణ రాష్ట్రం పలు సమస్యలతో ఇబ్బందులు పడుతూనే సంక్షేమ పథకాల ప్రకటన చేసింది. పాలనలో ఏవైనా లోపాలుంటే సూచనలు చేస్తాం.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కృషి చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో చిన్న పరిశ్రమలు, చిత్ర పరిశ్రమ, పారిశ్రామిక వర్గం ఎదగాల్సి ఉంది అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, రఘు, పిట్టల రవీందర్‌తోపాటు పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు