బియ్యం నిల్వల స్వాధీనం

26 Oct, 2014 03:24 IST|Sakshi

సోమల: సోమల మండలం కందూరులోని ఒక రైస్ మిల్లులో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 500 బస్తాల బియ్యాన్ని తహశీల్దార్ నరసింహులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి ఉద యం తొమ్మిది గంటల సమయంలో కందూరులోని ఓ రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచుతున్నట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్పకు సమాచారం అందింది. వివరాలు సేకరించిన ఆయన తహశీల్దార్ నరసింహులు, సివిల్ సప్లై డీటీ పద్మావతి, డీటీ కోటిరెడ్డి, ఆర్‌ఐ కోదండరామయ్యను అక్కడికి పంపారు.

తనిఖీలు నిర్వహించగా అనుమతి లేకుండా ఉంచిన 500 (25 కేజీలు బరువుగల) బస్తాలు బియ్యం, 50 బస్తాల వడ్లు స్వాధీ నం చేసుకున్నారు. రికార్డులు పరిశీలించగా రైస్ మిల్లుకు 2011వరకే  బియ్యం విక్రయానికి అనుమతులున్నాయని, ఆపై రెన్యువల్ చేసుకోలేదని తేలింది. రైస్ మిల్లు యజమానిపై చర్యలకు సిఫారసు చేస్తూ తహశీల్దార్ నివేదిక పంపారు. స్వాధీ నం చేసుకున్న బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్‌కు తరలించారు.

మూడు నెలల క్రితం కందూరు గ్రామ సమీపంలో 245 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిమ్మనపల్లె, కలికిరి, కలకడ, రాయచోటి, వాల్మీకిపురం, పీలేరు మండలాల నుంచి వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేసి, కందూరు, సోమల, పెద్ద ఉప్పరపల్లె ప్రాంతాల్లో పాలిష్ చేసి అమ్ముతున్నట్లు సమాచారం. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని అన్నారు.
 

మరిన్ని వార్తలు