పో‘స్డల్‌’ బ్యాలెట్‌

17 May, 2019 09:40 IST|Sakshi

సాక్షి, కాకినాడ సిటీ: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు అందించిన పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్నా ఇంకా అనేక బ్యాలెట్లు తిరిగి సంబంధిత అధికారులకు అందలేదు. జిల్లాలో 61,927 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తులు చేయగా అధికారులు 59,805 మందికి పోస్టల్‌ బ్యాలెటుపంపిణీ చేశారు. వీటిలో ఇప్పటి వరకు 36,178 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు ఇంకా సమయం ఉండడంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెబుతున్నారు. జిల్లాలోని మూడు పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి మొత్తం 28,748 మంది ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ను పంపించారు. వీరి నుంచి తిరిగి మంగళవారం నాటికి 16,517 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ అధికారులకు బ్యాలెట్లు తిరిగి పంపించారు. ఇంకా 12,231 మంది పార్లమెంట్‌కు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్లు అందాల్సి ఉంది. జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 31,057 మందికి పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు పత్రాలు పంపగా వీరిలో 19,661 మంది తమ ఓటు హక్కును   వినియోగించుకొని తిరిగి పోస్టల్‌ బ్యాలెట్‌ను అధికారులకు తిప్పిపంపించారు. ఇంకా 11,396 మంది అభ్యర్థుల నుంచి రావల్సి ఉంది. చాలా మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందలేదని, చెబుతుండగా తమకు దరఖాస్తులు అందించిన వారందరికీ పత్రాలను పంపించామంటున్నారు. ఆరు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నా, జారీ అయిన పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో తిరిగి సగం కూడా ఆర్వోలకు చేరలేదు. ఇంకా సమయం ఉంది కదా కౌంటింగ్‌కు గంట ముందు చేరే విధంగా పంపవచ్చనే ఉద్దేశ్యంతో కొందరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.


జిల్లాలో పలు ప్రాంతాల్లో...
జిల్లా కేంద్రంలో పని చేసే ఉద్యోగులు, వివిధ ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించారు. వీరికి కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నుంచి 48 గంటల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ కావాల్సి ఉంది. పోలింగ్‌ జరిగి నెల రోజులు కావస్తున్నా ఇంత వరకు అందకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పోస్టాఫీసుకు వెళ్లి ఆరా తీస్తున్నా ఫలితం లేకుండా పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


అసెంబ్లీవే ఎక్కువ...
జిల్లాలోని మూడు పార్లమెంట్, 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 59,805 మందికి పోస్టల్‌ బ్యాలెట్లు జారీ కాగా అసెంబ్లీకి సంబంధించి 16,517 ఓట్లు తిరిగి ఆర్వోలకు వచ్చాయి. పార్లమెంట్‌కు సంబంధించి తక్కువ బ్యాలెట్‌ ఓట్లు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించి 16,517 ఓట్ల మాత్రమే వచ్చాయి. ఇంకా ఆరు రోజులు సమయం ఉన్నా వేలాది మంది పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్లను పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా ఓటమి భయంతో టీడీపీ నేతలు, ఉద్యోగుల ఓట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులు స్వయంగా రంగంలోకి ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నట్లు సమాచారం. టీడీపీ నేతలే స్వయంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వివరాలను తీసుకొని, నేరుగా బ్యాలెట్‌ ఓట్లు తీసుకున్న అభ్యర్థుల వద్దకు వెళ్లి తమకే ఓట్లు వేయాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నేతలు అడ్డు చక్రం వేయడం వల్లనే ఇప్పటికీ వేలాది మందికి పోస్టల్‌ బ్యాలెట్లు అందలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. 

జారీ చేసిన పోస్టల్‌ బ్యాలెట్లు  59,805
     తిరిగి వచ్చినవి              36,178
     పార్లమెంట్‌కు వచ్చినవి  16,517
     అసెంబ్లీకి వచ్చినవి        19,661
     ఇంకా రావల్సినవి           23,627

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు