లీకువీరుడు.. దొరికేశాడు..

17 May, 2019 08:35 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే ప్రభుత్వోద్యోగుల పేర్లు, ఫోన్‌ నెంబర్లతో సహా బయటకు వచ్చిన వ్యవహారం మొత్తం.. ఓ తహసీల్దార్‌ దగ్గరుండి నడిపించాడని తేలింది. పోస్టల్‌ ఓట్లు కలిగిన ఉద్యోగుల జాబితాను బయటకు ఇవ్వకూడదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు జిల్లా అధికారులు చెప్పుకురాగా, అదే ఉద్యోగుల ఫోన్‌ నెంబర్లను సైతం భీమిలి టీడీపీ అభ్యర్ధి సబ్బం హరికి అందించిన నిర్వాకం వివాదాస్పదమైన సంగతి  తెలిసిందే. ఆ జాబితాను పట్టుకుని సబ్బం హరి ఒకేసారి 500మంది ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రలోభాల వల విసిరారు. ఈ భాగోతంపై సాక్షి పత్రికలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ విచారణకు ఆదేశించారు. డీఆర్వోను విచారణాధికారిగా నియమించారు. సబ్బం హరి మాట్లాడిన ఆడియో టేపులను పరిశీలించిన తర్వాత.. అది కచ్చితంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అని భావించి.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈలోగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల వాట్సాప్‌ మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌ కూడా చెక్‌ చేశారు. మొత్తంగా విచారణలో జిల్లాలోని ఓ తహసీల్దార్‌ ఈ డేటా లీక్‌కు పాల్పడినట్టు తేలింది. మొత్తం ఫోన్‌ నెంబర్లతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ కలిగిన ఉద్యోగుల జాబితాను సదరు తహసీల్దార్‌... సబ్బం హరికి అందించినట్టు తెలిసింది. దీనిపై నిగ్గు తేల్చిన జిల్లా ఉన్నతాధికారులు ఆ తహసీల్దార్‌పై సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌కు నివేదించినట్టు తెలిసింది. కలెక్టరేట్‌ అధికారులకు సంబంధం లేదట వాస్తవానికి కలెక్టరేట్‌లో పనిచేసే రెవెన్యూ అధికారులపైనే తొలుత సందేహాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారం  పర్యవేక్షించే సెక్షన్‌ వర్గాలపైనా అనుమానాలు రేకెత్తాయి. కానీ సమగ్ర విచారణ అనంతరం కలెక్టరేట్‌ వర్గాలకు సంబంధం లేదని, ఇదంతా ఆ తహసీల్దార్‌ నిర్వాకమేనని తేలినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు