వేతన సవరణ చేపట్టాలి

13 Feb, 2014 23:31 IST|Sakshi

సంగారెడ్డి జోన్, న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోసం పోస్టల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండవరోజైన గురువారం కూడ జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. సంగారెడ్డి, మెదక్ పోస్టల్ డివిజన్‌లలోని ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో పోస్టల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి, సిద్దిపేట, జోగిపేటల్లోని తపాలా కార్యాలయాలు తెరుచుకోకపోవడంతో ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా మూతపడ్డాయి. సంగారెడ్డి హెడ్ పోస్టాఫీసు వద్ద డివిజన్ పరిధిలోని ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ సంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐదేళ్లకోసారి వేతన సవరణ జరిపేలా చర్యలు చేపట్టాలన్నారు. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్న క్యాజువల్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం శ్రమదోపిడికి గురి చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగికి అదనపు అర్హతలు ఉన్నా, ప్రమోషన్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభించడం తగదన్నారు.

వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఐదు ప్రమోషన్‌లు పొందేలా చూడాలన్నారు.  ఆంక్షలు లేని కారుణ్యనియామకాలు పునరుద్ధరించాలనీ,  ఉద్యోగులందరికీ మెరుగైన వైద్య సేవలు, ఓవర్ టైమ్, డ్రెస్ అలవెన్సులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రివైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐపీఈయూ, ఎన్‌యూపీఈ నాయకులు శంకర్, మాణయ్య, సంజీవ్, శ్రీనివాస్, రాములు, శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్, ఉద్యోగులు రఘుకుమార్, దుర్గాప్రసాద్, యాదమ్మ, దుర్గావేణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు